ప్రాణం తీసిన పార్కింగ్ ఫీజు

Update: 2019-05-11 04:56 GMT

ఒక్కోసారి చిన్న విషయమే ప్రాణాంతకం అవుతుంది. కొద్దిపాటి అసహనం ఊపిరి తీస్తుంది. వైరానికి పెద్దగా కారణాలక్కరలేదు. చిల్లర కారణాలతో లోకాన్ని విడిపోవాల్సి వస్తుంది. ఇపుడు అటువంటి సంఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. సినిమా థియేటర్ లో పార్కింగ్ ఫీజు విషయంలో సిబ్బందితో జరిగిన గొడవ ఒక యువకుని ప్రాణం తీసింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.

తూర్పు బెంగళూరులోని భారతీనగర్‌లో ఉన్న లావణ్య థియేటర్‌‌లో కాంచన-3 సినిమా చూసేందుకు ఆస్టిన్ టౌన్‌కు చెందిన భరణిధరణ్ (38) తన కజిన్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. థియేటర్ పార్కింగ్ వద్ద ఉన్న సెల్వరాజ్ బైక్ పార్కింగ్‌కు రూ.10 ఇవ్వాలని అడిగాడు. అందుకు భరణి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే థియేటర్‌లోని హౌస్ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తున్న శేఖర్‌తో కలిసి భరణిపై సెల్వరాజ్ దాడిచేశాడు. థియేటర్ వెనక్కి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన భరణిని థియేటర్ యాజమాన్యం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం పరారీలో వున్న నిందితులు సెల్వరాజ్, శేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Similar News