టీఆర్ఎస్-ఎంఐఎం స్నేహంపై ఫుల్‌ క్లారిటీ... టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని అసదుద్దీన్ పిలుపు

Update: 2018-11-23 07:27 GMT

అసలు ఆ  రెండు పార్టీల మధ్య స్నేహం ఉందా లేదా ఫ్రెండ్లీ పార్టీలేనా...ఒకవేళ ఫ్రెండ్లీ పార్టీలైతే, ఎందుకు పొత్తు పెట్టుకోలేదు గత కొన్ని నెలలుగా, రోజులుగా టీఆర్ఎస్-ఎంఐఎంపై ఇవే ప్రశ్నలు. వీటన్నింటికీ మొన్న అసదుద్దీన్‌ కాస్త క్లియర్‌గా సిగ్నల్స్ ఇస్తే, ఇప్పుడు కేసీఆర్‌ క్రిస్టల్‌ క్లియర్‌గా క్లారిటీ ఇచ్చేశారు. ఎలాంటి మొహమాటం లేకుండా తేల్చేశారు. 

తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో, అసెంబ్లీలో, టీఆర్ఎస్‌-ఎంఐఎం మధ్య మాటల యుద్ధమే నడిచింది. ముఖ్యంగా కేటీఆర్, అక్బరుద్దీన్‌ డైలాగ్‌ వార్‌, మామూలుగా సాగలేదు. అయితే, కేసీఆర్ మాత్రం ఎంఐఎంపై ఎప్పటికప్పుడు సాఫ్ట్‌గానే మాట్లాడారు. అటు ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా, తమ్ముడిలా ఆవేశపడకుండా, కేసీఆర్‌తో టచ్‌లోనే ఉన్నారు. 

2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతూ వచ్చింది. కానీ వన్‌ ఫైన్ ‌మార్నింగ్, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వ అస్థిరతకు కుట్ర జరుగుతోందని, ఢిల్లీ నుంచి నేరుగా క్యాంప్‌ ఆఫీసుకు వచ్చిన అసద్‌, కేసీఆర్‌ చెవిలో వేయడంతో, రెండు పార్టీల మధ్య స్నేహానికి రాచబాటపడింది. కేసీఆర్‌ సర్కారుకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటించి, అండగా ఉంటామని చెప్పింది.


అయితే, టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య రహస్య స్నేహముందని, బీజేపీ ఎప్పటికప్పుడు బాంబులు విసురుతూనే ఉంది. తాజాగా పాతబస్తీలోనూ కాంగ్రెస్ ఇవే ఆరోపణలు చేసింది. దీన్ని రెండు పార్టీలు కూడా ఖండించలేదు. ఈ ఎన్నికల్లోనూ రెండుపార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపించినా, జట్టుకట్టలేదు. అయితే, రెండు పార్టీల మధ‌్య స్నేహపూర్వక అవగాహన ఉందని అర్థమైంది. కానీ విపక్షాలకు ఆయుధమిచ్చినట్టవుతుందని,  ఏనాడూ ధ్రువీకరించలేదు కేసీఆర్. అయితే, నిర్మల్‌ సాక్షిగా, రెండు పార్టీల అధినేతల ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు.

మొన్న నిర్మల్‌లో జరిగిన సభలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ పాల్గొన్నారు. కానీ నిర్మల్ నుంచి ఎంఐఎం పోటీ చేయడం లేదు. అక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంద్రకరణ్‌ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొన్నారు అసద్. టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీలకు స్నేహం ఉందని అర్థమైంది. అంతేకాదు, నిర్మల్‌లో టీఆర్ఎస్‌కు ప్రధాన అభ్యర్థి అయిన కాంగ్రెస్‌ నేత మహేశ్వర్‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలు కురిపించి, టీఆర్ఎస్‌కు మేలు చేసే ప్రయత్నం చేశారు. తాను సభకు రాకుంటే, 25 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్‌ చేసిందని ఆరోపించారు అసద్. అసదుద్దీన్‌ వ్యాఖ్యలతో ఎంఐఎం, టీఆర్ఎస్‌ మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందని దాదాపు ఖరారైంది. అయితే తాజాగా, నిర్మల్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్, నేరుగా చెప్పేశారు. అవును. రెండు పార్టీల మధ్య స్నేహం ఉందని కుండబద్దలు కొట్టారు.

మొత్తానికి టీఆర్ఎస్-ఎంఐఎం నేరుగా కలిసి పోటీ చేయకపోయినా, రెండింటి మధ్య అవగాహన ఉందని నిర్మల్‌ కేసీఆర్‌ సభతో తేలిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని స్పష్టమైంది. అయితే రెండు పార్టీల మధ్య నిర్దిష్టంగా ఏయే స్థానాల్లో అవగాహన ఉందో అధికారికంగా చెప్పకపోయినా, పాతబస్తీతో పాటు తాము బలంగా ఉండి, పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ సహకారాన్ని ఎంఐఎం తీసుకోవడం....అలాగే ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టని చోట, ముస్లింల ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా, ఎంఐఎం ప్రచారం చేయడం వంటి అవగాహన కుదిరిందని తెలుస్తోంది. ఇలా మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ జట్టుకడితే, టీఆర్ఎస్-ఎంఐఎం కూటమి కట్టని కూటమి. పాపం బీజేపీనే ఒంటరి పార్టీ.

Similar News