శశికళ భర్త నటరాజన్ కన్నుమూత

Update: 2018-03-20 03:43 GMT

అన్నాడీఎంకే మాజీ నేత శశికళ భర్త నటరాజన్‌(73) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 1.30కి ఆయన తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం అక్టోబర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నఆయనకు మళ్లీ ఇదే సమస్య తలెత్తడంతో రెండు వారాల నుంచి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు నటరాజన్ మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన నటరాజన్‌.. 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. అంతేకాక జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ ఆయన వ్యవహరించారు.

చెన్నై బీసెంట్‌ నగర్‌లోని నివాసానికి నటరాజన్‌ భౌతికకాయంను తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు పెరోల్‌ మంజూరు కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. భర్త మరణవార్తను తెలుసుకున్న శశికళ విషాదంలో మునిగిపోయింది. పెరోల్ రాగానే ఆమె బెంగుళూరు పరప్పన్ జైలు నుంచి చెన్నై  వెళ్లనుంది. నటరాజన్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

Similar News