తెలంగాణను వణికిస్తున్న చలి

Update: 2018-12-18 15:24 GMT

తెలంగాణపై చలి పంజా విసిరింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో రాత్రి సమయంలోనే కాదు పగటిపూట కూడా చలి ఎక్కువగా ఉంటోంది. చలిపులి దెబ్బకు చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు. ఇళ్లలో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పెథాయ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై పడింది. తెలంగాణను చలి గజగజ వణికిస్తోంది. కొద్దిరోజులుగా సాధారణ స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 2-3 డిగ్రీలు తగ్గాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చలిగాలుల తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.   

హైదరాబాద్ ఢిల్లీ తరహా వాతావరణం నెలకొంది. సాధారణంగా 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఒక్కో రోజులోనే 5 డిగ్రీల తేడా కనిపించింది. ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో బయటకు వచ్చేందుకు నగరవాసులు వణికిపోయారు. పగటి వేళలో సైతం చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడ్డారు. చలితీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు పిల్లలను స్కూళ్లకు పంపకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. 

తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశంలో కేంద్రీకృతం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకేరకమైన వాతావరణం నెలకొంది. మరో మూడు, నాలుగు రోజులపాటు చలితీవ్రత ఇదే తరహాలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలిగాలులను తట్టుకునేలా నగరవాసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వస్తున్నారు. ముఖాలకు మాస్క్‌లు, స్వెర్టర్లు లేకుండా రోడ్లపైకి రావడం లేదు. ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు చలితీవ్రతతో ఉదయం 10గంటల వరకూ బోసిపోతున్నాయి. శివారు ప్రాంతాల్లో మధ్యాహ్నం సైతం చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రహదారులు ఖాళీగా కనిపించాయి.  

Similar News