ఏపీలో స్వైన్ ఫ్లూ కలకలం..ఇద్దరు మృతి.. ఇలా జాగ్రత్త పాటించండి..

Update: 2018-10-17 10:14 GMT

ఏపీలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాంతక స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటికి మొత్తం ఐదు కేసులు నమోదుకాగా ముగ్గురు చికిత్స అందుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు చికిత్సా ఫలితం లేకుండా మంగళవారం మరణించారు. సోమవారం కలెక్టర్ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలని కోరారు. జిల్లాలో పన్నెండు స్వైన్ ఫ్లూ వైద్యకేంద్రాలు ఏర్పాటు చేశామని ధైర్యంగా ఉండాలని కోరారు. అటు చిత్తూరు జిల్లా ఐరాల మండలం గాజులపల్లికి చెందిన మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్టు సోమవారం లక్షణాలు బయటపడ్డాయి. సదరు మహిళను చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇటు తెలంగాణ‌లోనూ స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. సోమవారం వరకు తెలంగాణలో స్వైన్ ఫ్లూ కారణంగా ఆరుగురు మరణించారు. మొత్తం 69 స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాగా...11 మంది పరిస్థితి విషమంగా ఉంది. స్వైన్ ఫ్లూ అంతకంతకూ విస్తరిస్తుండటం, మరోవైపు శీతాకాలం వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బయటికి వెళ్లే సమయాల్లో మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News