హ్యాట్సాప్ ఎస్పీ స‌న్ ప్రీత్ సింగ్ జీ

Update: 2018-01-13 13:07 GMT

ఆ గ్రామానికి వెళ్లాలంటే భయం... ఆ పల్లెలో ఎవరు అడుగు పెట్టే సాహసం చేయరు.ఎన్నికల సమయంలో తప్ప.. పాలకులు సైతం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడరు. ఎర్రబస్సు అంటే ఎరుగదు.  ఎక్కడికి వెళ్లాలన్నా.. నడకే దారి.. తమ అవసరాలు తీర్చుకోలేని  దుర్భర స్థితిలో ఉన్న అభాగ్యులకు తన వంతు సాయం చేశాడు పోలీస్ అధికారులు‌.  అడవిబిడ్డల జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం చేసి మంచి మనస్సున పోలీస్‌ అనిపించుకున్నాడు.  మానవత్వాన్ని చాటుకున్న ఆ పోలీస్‌ని చూడాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

దట్టమైన అటవీ ప్రాంతంలో  పర్యటిస్తున్న ఆయన పేరు  సన్‌ప్రీత్‌ సింగ్. తెలంగాణలో   కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూలు జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యలు చేపట్టారు. నేరస్తులను శిక్షించడంలో ఎంత కఠినంగా ఉంటారో.. మానవత్వం చాటుకోవడంలో తానకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అభాగ్యుల జీవితాల్లో తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటాడు .

నాగర్‌కర్నూలు జిల్లా లింగాల  మండలం..  దట్టమైన  నల్లమల అటవీ ప్రాంతమైన మేడి మల్కాల, ఈర్లపెంట, బౌనాపూర్‌.  అడవిపుత్రులు,  చెంచు గిరిజనుల దుస్థితి తెలుసుకున్న ఆయన వారి జీవితాల్లో సంతోషం నింపేందుకు నడుంబిగించాడు. కనీస అవసరాలు తీర్చుకోలేక  దుర్భర జీవితాలు గడుపుతున్న వారి సమస్యలను తెలుసుకునేందుకు తన బృందంతో కలిసి పర్యటించారు.  

అడవిబిడ్డలు ఉంటున్న ప్రాంతాల్లో పర్యటించిన అక్కడివారికి  దుప్పట్లు,  నిత్యవసర సరకులను సరఫరా చేయడంతో పాటుచెంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.   చెంచులకు  అందుతున్న వైద్య, విద్యతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  సమస్యలను జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.  అనంతరం బైరాపూర్‌ చెంచుపెంట దగ్గర బౌరమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

తమ సమస్యల పరిష్కారానికి ఎస్పీ చొరవ చూపడంపై గిరిపుత్రులు  హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ సమస్యలను పట్టించుకోలేదని వాపోయారు. మావోయిస్టుల జాడ కోసం ముప్పతిప్పలు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు చెంచుల యోగక్షేమాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపించడంపై  పలువురు హర్షం  వ్యక్తం చేస్తున్నారు. 

Similar News