నేటి నుంచి రైతు బంధు చెక్కుల పంపిణీ

Update: 2018-10-05 05:05 GMT

యాసంగి సీజన్‌కు రైతుబంధు చెక్కులను ఇవాళ్టి నుంచి రైతులకు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా ఆర్డర్ పే చెక్కులనే ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా చెక్కులను ఇప్పటికే జిల్లాలకు తరలించింది వ్యవసాయ శాఖ. మొత్తం 568 మండలాలకు సంబంధించి తొమ్మిది బ్యాంకులు చెక్కుల ముద్రణ చేపట్టాయి. వీటిలో 18 జిల్లాల్లో 110 మండలాల పరిధిలో పంపిణీకి అవసరమైన చెక్కులు సిద్ధమయ్యాయి. 110 మండలాలకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు, టీఎస్‌కాబ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ల నుంచి సుమారు 11 లక్షల చెక్కులు జిల్లాలకు చేరాయి. మిగతా మండలాల చెక్కులు కూడా సిద్ధం చేస్తున్నారు.

మరోసారి రైతుబంధు చెక్కుల పంపిణీకి అంతా సిద్ధమయ్యింది. ఓవైపు పథకం అమలును అడ్డుకునేందుకు విపక్షాలు విఫలయత్నం చేస్తున్నా మరోవైపు, పెద్ద హడావుడి లేకుండా పనులు చకచకాసాగిపోతున్నాయి. ఇప్పటికే చెక్కుల ముద్రణ ప్రక్రియను వేగవంతం చేశారు. పలు జిల్లాలకు చెక్కులను సరఫరా చేసింది వ్యవసాయ శాఖ. ఇటీవల అసెంబ్లీ రద్దవడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో రెవెన్యూశాఖ నిమగ్నమవడంతో రైతుబంధు చెక్కుల పంపిణీని వ్యవసాయ, ఉద్యానశాఖలు క్షేత్రస్థాయిలో ఇతరశాఖలతో సమన్వయం చేసుకొని పంపిణీ చేయనుంది.

రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్రంలో నగదును అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇప్పటికే ఆర్‌బీఐకి లేఖ రాశారు. ఈ మేరకు అవసరానికి తగ్గట్లుగా నగదు అందుబాటులో ఉంచుతామని ఆర్‌బీఐ వర్గాలు రాష్ట్రానికి తెలిపినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో నగదు అందుబాటును బట్టి సుమారు నెల నుంచి నలభై రోజుల పాటు చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఆన్ గోయింగ్ స్కీంల అమలుకు ఎన్నికల కోడ్ వర్తించక పోవచ్చనేది అధికారుల అభిప్రాయం. ఒకవేళ పథకం ఆపమంటూ విపక్షాలు ఫిర్యాదు చేసినా ఆన్ గోయింగ్ స్కీం కనుక, రైతుబంధు పథకానికి ఈసీ అడ్డు చెప్పక పోవచ్చనే అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడిస్తున్నారు. కానీ బతుకమ్మ చీరల తరహాలో రైతుబంధు చెక్కుల పంపిణీకి కూడా ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉందనే ఆందోళన చర్చ జరుగుతోంది. 

Similar News