కన్నకొడుకులా ఓ కుటుంబానికి సాయం చేసిన టాప్ హీరో

Update: 2018-02-08 09:48 GMT

జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి  నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ గత ఏడాది చెన్నైలోని మెరీనా తీరంలో ప్రారంభమైన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా ఊపందుకుంది. ఆ సమయంలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంధ సంస్థలు, సినీనటులు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సేలంలో జరిగిన రైల్‌రోకోలో యోగేశ్వరన్‌ (17) రైలింజన్‌ పైకి ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు.

అతడి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన లారెన్స్‌ మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. ‘మనం ఉండేందుకు ఇల్లు కట్టిస్తానని పేర్కొన్న కుమారుడు చిన్నతనంలోనే మృతిచెందాడంటూ’ తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పడంతో, తానే మీ కుమారుడిలా ఇల్లు కట్టిస్తానని లారెన్స్‌ హామీ ఇచ్చాడు. అనంతరం లారెన్స్‌ ఉత్తర అమ్మాపేటలో 800 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి 500 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించాడు. రూ.22 లక్షలతో నిర్మించిన ఇంటి తాళాలను బుధవారం లారెన్స్‌ మృతుడు యోగేశ్వరన్‌ కుటుంబసభ్యులకు అప్పగించాడు.

Similar News