ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరిన పెట్రోల్ ధర...సెంచరీ దిశగా దూసుకుపోతున్న...

Update: 2018-09-25 05:04 GMT

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. త్వరలోనే సెంచరీ దాటనున్నాయి. గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటిసారిగా లీటర్‌ పెట్రోల్‌ ధర 90 రుపాయిల మార్క్‌ను దాటి రికార్డ్‌ సృష్టించింది. ముంబైలో ఐవోసీ ఔట్‌లెట్లలో లీటర్‌ పెట్రోల్‌ ధర 90రూపాయిల 8పైసలకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి.

దేశంలో పెట్రో ధరలు త్వరలోనే సెంచరీ దాటే సూచనలు కన్పిస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. సోమవారం కూడా ధరల పెంపు కొనసాగింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పెట్రో కంపెనీలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 90రూపాయిల మార్క్‌ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 82రూపాయిల 72పైసలకు చేరింది. హైదరాబాద్‌లో 87రూపాయిల 70పైసలకు చేరింది.  

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల్ని దాదాపూ రోజూ పెంచుకుంటూ పోతున్నాయి. గత ఐదు నెలల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు 4రూపాయిల 66పైసలు పెరగగా డీజిల్‌ ధర 6రూపాయిల 35పైసలు పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే, లీటరు పెట్రోల్ ధర వందకు చేరడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. తర్వరలోనే పెట్రోలు ధర సెంచరీని దాటనుంది. 
 

Similar News