కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఊరట

Update: 2018-06-05 08:20 GMT

 కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ముందస్తు బెయిల్‌పై సమాధానం చెప్పేందుకు ఈడీ నాలుగు వారాల సమయం కోరడంతో చిదంబరానికి తాత్కాలిక ఉపసమనం లభించింది. ఇటీవల చిదంబరం ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోగా దీనిపై జూన్‌ 5లోగా స్పందించాలని కోర్టు ఈడీని కోరింది. నేటి విచారణలో ఈడీ మరింత గడువు కావాలని అడిగింది. దీంతో కోర్టు ఆయనకు మరికొన్ని రోజులు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది. ఈ కేసులో చిదంబరం కొడుకు కార్తి చిదంబరాన్ని కూడా జులై 10 వరకు అరెస్ట్‌ చేసే అవకాశం లేకుండా కోర్టు తీర్పిచ్చింది.

అయితే ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ప్రశ్నించడానికి ఈడీ చిదంబరానికి సమన్లు పంపించింది. ఈరోజు ఆయన ఈడీ ముందు హాజరుకావాలని కోరింది. కోర్టు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించినప్పటికీ దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాలని చిదంబరాన్ని ఆదేశించింది. విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని తెలిపింది. 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులోనూ ఇరువురిపై దర్యాప్తు జరుగుతోంది.

Similar News