హెల్మెట్‌లు ధరించి రోగులకు వైద్యం

Update: 2018-09-08 06:03 GMT

ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తలకు హెల్మెట్ లు ధరించి రోగులకు వైద్య సేవలు చేయడం వైరల్ గా మారింది. ఇదేదో హెల్మెట్ అవగాహన కార్యక్రమం అనుకునేరూ పెద్దాస్పత్రిలో తరచూ పెచ్చులూడుతుండటంతో ప్రాణభయంతో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చి వినూత్నరీతిలో నిరసనకు దిగారు. హైదరాబాదులోని దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ భవనం పెచ్చులూడి పడుతుందని దీంతో పని చేసే వైద్యులు ఏ సమయంలో తమ నెత్తిమీద పెచ్చులు ఊడిపడతాయోనని భయాందోళన చెందుతున్నారు. అందుకే రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకొని తమను తాము కాపాడుకుంటున్నారు. ప్రభుత్వం చర్యలు ప్రారంభించే వరకు తమ నిరసన కొనసాగుతుందని జుడాలు స్పష్టం చేశారు. 

గత నెల రోజుల్లో ఐదు సార్లు పెచ్చులూడి పడ్డాయని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోగులకు సేవలు అందించాల్సి వస్తోందని జుడాలు ఆవేదన వ్యక్తం చేశారు. భవంతి పైఫ్లోర్  లు వినియోగానికి పనికి రావని అధికారులు గతంలోనే తేల్చి చెప్పారని దీంతో కొత్త భవనం నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా నేటికీ ఎలాంటి పురోగతి లేదని  మండిపడుతున్నారు. ఆస్పత్రి ఫ్లోర్  పెచ్చులు ఊడిపడి ఇటీవల ఓ జూనియర్ డాక్టర్ గాయపడ్డారని అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారని చెబుతున్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహించాలంటే సిబ్బంది వణికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Similar News