లోక్‌సభలో ఆందోళన.. గోవిందా..గోవిందా అంటూ...

Update: 2018-02-06 09:17 GMT

విభజన హామీలు నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధోళన ఉధృతం చేశారు.  సభ ప్రారంభమైన కాసేపటికే ప్లకార్డులు పట్టుకొని ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడటంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్‌ సుమిత్రా మహాజన్. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను....రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలు చర్చలకు ఆహ్వానించారు. వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఆహ్వానాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు సున్నితంగా తిరస్కరించారు. 

వాయిదా తర్వాత తిరిగి లోక్‌సభ ప్రారంభం కావడంతో టీడీపీ ఎంపీలు మళ్లీ ఆందోళనకు దిగారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ వెల్‌లోకి వెళ్లి ఎంపీీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న ఎంపీ మాగంటి బాబుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా సభలో ఆందోళన చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో చిడతలు వాయిస్తూ, గోవిందా..గోవిందా అంటూ నారదుడి వేషంలో నిరసన తెలియజేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ముగిసేవరకూ సహకరించాలంటూ రాజ్‌నాథ్‌సింగ్..సుజనాచౌదరిని పిలిచి మాట్లాడారు. అయినా టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బుట్టా రేణుక తన సీటు వద్దే నిలబడి నిరసన తెల్పగా, మరో ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు.

Similar News