ఆ నియోజకవర్గంలో వైసీపీ సీటు ఆయనకేనా..?

Update: 2018-06-16 13:38 GMT

ఓ వైపు పాదయాత్ర, మరోవైపు నాయకుల చేరికతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపుమీదవుంది. ఇప్పటికే సగానికి పైగా సీట్ల ఎంపిక పూర్తిచేశారు అధినేత వైయస్ జగన్. పాదయాత్రలో ఎవరెవరికి సీట్లు ఇస్తున్నది  కార్యకర్తలకు చెబుతున్నారు. అయితే ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీకి ఎదురులేదనే నానుడి ఉంది. అందులో ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలో  వైసీపీ కాస్త బలంగానే ఉండగా నాయకుల ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి జంకే వెంకటరెడ్డి గెలుపొందారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న జంకే ఒంగోలు ఎంపీ వైవి. సుబ్బారెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కెపి. కొండారెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి మద్దతు ఉంది. కొండారెడ్డి గత ఎన్నికల సందర్బంగా అధినేత ఇచ్చిన హామీపైనే ఎక్కువగా ఆశలుపెట్టుకున్నారు. కానీ నియోజకవర్గంలో కొందరి కార్యకర్తల నానుడి మాత్రం మరోలా ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరమని ఎమ్మెల్యే జంకేను టీడీపీ నేతలు సంప్రదిస్తే వైసీపీలోనే కొనసాగుతానని జంకే చెప్పారని.. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జంకే వెంకటరెడ్డికే టికెట్ లభిస్తుందని అనుకుంటున్నారు. ఇదిలావుంటే మరో నేత వెన్నా హనుమారెడ్డి కూడా  సీటుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలో తనకే టికెట్ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని సంప్రదిస్తున్నారు. వీరందరూ పైకి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా ఎవరి పైరవీలు వారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలు సైతం ఎవరికివారు  సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోనని కార్యకర్తలు మధనపడిపోతున్నారట. 

Similar News