తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు ఊహించని షాక్...!

Update: 2018-10-12 11:28 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ జగదీశ్ ఇవాళ తీర్పు వెలువరించారు. పారదర్శక విచారణ కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగించామన్న ధర్మాసనం మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. హైవే ప్రాజెక్టుల కేటాయింపులో  పళనిస్వామి అవినీతి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డీఎంకే ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత హైకోర్టు ఈమేరకు స్పందించింది. 

తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆరోగ్యమంత్రి సి. విజయభాస్కర్‌ సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. సీఎం పళనిస్వామి తన బంధువులకు చెందిన పలు కంపెనీలకు ఐదు హైవే ప్రాజెక్టులను కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్‌లో డీఎంకే పార్టీ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్‌కి ఫిర్యాదు చేసింది. డీవీఏసీ స్పందనపై సంతప్తి చెందని ఆ పార్టీ ఆగస్టు నెలలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
 

Similar News