పార్లమెంట్‌లో సేమ్‌ సీన్‌

Update: 2018-04-02 09:45 GMT

పార్లమెంట్‌లో వాయిదా పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయసభలు ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ మొదట లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిష్టంభన యథాతధంగా కొనసాగింది. 12 గంటపాలకు సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు నిరసన మరింత ఉధృతం చేశారు. కావేరి జలాల వివాద పరిష్కారానికి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ్యుల నిరసనల మధ్యే సభను నడిపించేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ యత్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.

అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన మధ్యే అవిశ్వాస తీర్మానంపై పలు పార్టీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ ప్రకటించారు. సభ సజావుగా సాగితే అవిశ్వాసంపై చర్చ చేపట్టవచ్చన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దేశం మొత్తం పార్లమెంటు సమావేశాలను చూస్తోందని సభలో ఇలా వ్యవహరించడం సరికాదని చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అన్ని సమస్యలపై చర్చకు అనుమతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తమ తమ కుర్చీల్లోకి వెళ్లి కూర్చోవాల్సింది ఎంపీలను వెంకయ్య కోరారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. వెల్‌లోనే ఉంటూ నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.

Similar News