రాహుల్‌ గాంధీతో ముగిసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

Update: 2018-11-21 07:31 GMT

ఎల్లుండి మేడ్చల్‌ లో నిర్వహించనున్న సభలో సోనియా, రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో కుంతియాతో కలిసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణతో పాటు నియోజకవర్గంలోని సమస్యలన్నీ రాహుల్‌కు వివరించినట్లు వెల్లడించారు. పార్టీ పరమైన నిర్ణయాలు నచ్చకే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్న విశ్వేశ్వర్‌రెడ్డి రెండేళ్లుగా పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

ఇటు వలసలకు ఇది ప్రారంభం మాత్రమే అని త్వరలో మరిన్ని చూస్తారని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా తెలిపారు. కొండాను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్న ఆయన విశ్వేశ్వర్‌రెడ్డి రాకపై రాహుల్‌ ఆనందం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇక నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తారని చాలామంది సిట్టింగులు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం జరగడం లేదని తెలంగాణ ద్రోహులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఐదు ప్రధాన కారణాలంటూ ఓ లేఖను విడుదల చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. 

అయితే గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్ నుంచి రెండు వికెట్లు పడతాయంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు సీతారాం నాయక్‌ పేర్లు బయటపడ్డాయి. దీంతో వీరిద్దరూ పార్టీ పెద్దలతో కలిసి ప్రచారం అంతా అబద్ధం అని తేల్చిచెప్పారు. దీంతో విషయం సద్దుమణిగిందనుకున్న సమయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం అధికార టీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. మరోవైపు ఇద్దరు కాదు టీఆర్ఎస్‌ను మొత్తం ముగ్గురు వీడే అవకాశం ఉన్నట్లు రేవంత్‌ ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు ఎవరా ఇద్దరనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 


 

Similar News