విశ్వేశ్వర్‌రెడ్డి హస్తం కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరార్..

Update: 2018-11-21 13:07 GMT

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 


టీఆర్ఎస్‌ను వీడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితుల గురించి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌కు వివరించారు. కాంగ్రెస్‌లో చేరడానికి ఆయన ఆసక్తి చూపడంతో రాహుల్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 23న మేడ్చల్‌ లో జరిగే బహిరంగ సభలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.‌ 

టీఆర్ఎస్‌ను వీడటానికి మంత్రి మహేందర్‌రెడ్డితో వివాదాలు కారణం కాదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. మహేందర్‌రెడ్డితో మొదటి నుంచి విభేదాలున్నాయని తెలిపారు. ఎన్నికల వేళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాక వల్ల కాంగ్రెస్‌ పార్టీకి తప్పకుండా ప్రయోజనముంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్ఝ్ కుంతియా అన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి మూడు తరాల నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని గుర్తు చేశారు.ఈ నెల 23న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత నుంచి ఆయన ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తారని కుంతియా చెప్పారు. 


 

Similar News