మా వ‌ర‌ద‌ల‌కు మీరే కార‌ణం...కేర‌ళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Update: 2018-08-24 06:26 GMT

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు యావత్ భారతం కదులుతోంది. అయితే, ఇది ప్రకృతి విపత్తుకాదని తమిళనాడు చేసిన నిర్వాకమని కేరళ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. తమిళనాడు తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేరళ ముళ్లపెరియార్‌ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్‌ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

డ్యాం నీళ్లు పోటెత్తడంతో కేరళలో వరదలొచ్చాయని సుప్రీం కోర్టుకు కేరళ నివేదించింది. అంతకుముందు ఇదే కేసులో గతంలో ముళ్లపెరియార్‌ డ్యాంలో నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించాలని, అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోనవకుండా ఉంటారని సర్వోన్నత న్యాయస్ధానం తమిళనాడును కోరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా వివాదాస్పద ముళ్లపెరియార్‌ డ్యామ్‌ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్‌ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది.

Similar News