జయలలిత సమాధి పక్కనే..

Update: 2018-08-08 11:30 GMT

కరుణానిధి-జయలలిత. తమిళ రాజకీయాల్లో బద్ద శత్రువులు. ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకున్న నాయకులు. వాళ్లిద్దరూ అసెంబ్లీలో ఉన్నారంటే, అదొక యుద్ధం. శాసన సభ రణక్షేత్రాన్ని తలపిస్తుంది. మాటల తూటాలు, ఎత్తుకుపైఎత్తులు, వాగ్దానాలపై వాగ్భాణాలు. తమిళ రాజకీయాల్లో ఇద్దరి శత్రుత్వం ఒక చెరగని పేజి. అలాంటిది ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఉంది. మొదట్లో మరీనా బీచ్‌లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది. డీఎంకేకు చెందిన ఆరెస్ భారతి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఇప్పుడు వైరిపక్షం అన్నాడీఎంకేనే అధికారంలో ఉండటం, మెరీనా బీచ్‌లో ఖననానికి అనుమతి ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ మండపం దగ్గర ప్రత్యేకంగా రెండెకరాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా డీఎంకే అంగీకరించలేదు.

Similar News