ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఉచ్చు చిదంబరం మెడకు బిగుసుకుంటుందా..?

Update: 2018-03-02 05:28 GMT

ఐఎన్ఎక్స్  మీడియా కేసు ఉచ్చు.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు బిగుసుకుంటుందా..? కార్తీ చిదంబరం విచారణలో సీబీఐ ఏం తేల్చనుంది..? ఐదు రోజుల కస్టడీలో మరెన్ని నిజాలు వెలుగుచూడనున్నాయి..? కార్తీ చిదంబరం మనీలాండరింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రోజుల సీబీఐ కస్టడీకి కార్తీని అనుమతించడంతో విచారణ మరింత వేగవంతం కానుంది. 

 ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో అరెస్ట్ అయిన కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో రెండో సారి హాజరుపరిచారు. ఇరు పక్షాలు వాదనలను వినిపించాయి. కార్తీని 14 రోజుల రిమాండ్ కు అనుమతించాలని సీబీఐ తరపున వాదించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తి చేశారు. నిందితుడిని, సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాల్సి ఉందని అందుకు కనీసం 14 రోజుల సమయం పడుతుందని కోర్టుకు నివేదించారు. 

సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్‌ నేత సింఘ్వీ ఆరోపించారు. కార్తీపై కేసు కక్ష సాధింపేనన్నారు. అయితే కోర్టు మాత్రం 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 6 వ తేదీ వరకు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రిమాండ్‌ సమయంలో రోజుకు రెండు గంటలు న్యాయవాదిని కలుసుకునేందుకు కార్తికి కోర్టు అనుమతించింది. ప్రిస్క్రిప్షన్‌లోని మెడిసిన్స్‌ తీసుకోవచ్చని అయితే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. సీబీఐ తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల కార్తీ చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. 

ఈ కేసులో త్వరలో కార్తీ తండ్రి , కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరంను కలిశామంటూ అప్పటి ఐఎన్‌‌ఎక్స్‌ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌ ముఖర్జీ సీబీఐ, ఈడీ విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా ఢిల్లీలోని పార్క్‌ హయత్‌ హోటల్‌‌‌లో కార్తీకి 7 లక్షల డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఐఎన్‌‌ఎక్స్‌‌ మాజీ డైరెక్టర్ల వాగ్మూలం ఆధారంగా ఇప్పుడు సీబీఐ తదుపరి కార్యాచరణకు పావులు కదుపుతోంది. పాటియాలా హౌస్‌లో జరిగిన వాదనలు వినడానికి చిదంబరంతో పాటు తల్లి నళినీ చిదంబరం కూడా వచ్చారు. 

Similar News