వచ్చే నైరుతిలో వానలకు ఢోకా లేదు

Update: 2018-01-20 10:41 GMT

ఈ ఏడాది నైరుతి సీజన్‌ నిరాశనే మిగిల్చింది. వచ్చే నైరుతి రుతుపవనాల సీజనూ ఇదే రీతిలో ఉంటుందని, ఈ ఏడాది ఆగస్టుదాకా ఎల్‌నినో ప్రభావం ఉండనుండడమే దీనికి కారణమంటూ వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే వచ్చే నైరుతి సీజన్‌పై ఆందోళన అక్కర్లేదని తెలిపింది అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత వాతావరణ విభాగం. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులుండబోవని, లానినా పరిస్థితులేర్పడి విస్తృతంగా వర్షాలు కురుస్తాయంది. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం చూపిన ఏడాది వర్షాభావ పరిస్థితులేర్పడతాయి. 

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఆ ఏడాది రుతుపవనాలు అంతగా ప్రభావం చూపకపోగా వర్షాలు అరకొరగా కురుస్తాయి. దీనినే ఎల్‌నినోగా పిలుస్తారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే రుతుపవనాల సీజన్‌లో వానలు బాగా కురుస్తాయి. దీనిని లానినాగా పేర్కొంటారు. ఎల్‌నినో ఏర్పడుతోందంటే రైతాంగంతో పాటు వ్యాపార వాణిజ్య, ఆర్థికరంగాలు ఆందోళన చెందుతాయి. ఎల్‌నినో, లానినా ల ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై రుతుపవనాలకు ఆరేడు నెలల ముందునుంచే వాతావరణ సంస్థలు, నిపుణులు అంచనాలు వేస్తుంటారు. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులుండ వచ్చంటూ వాతావరణ సంస్థలు కొన్నాళ్లుగా అంచనా వేస్తున్నాయి. పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగానే ఉండటంతో లానినా ఏర్పడి రానున్న రుతుపవనాల సీజన్‌లో వానలు సంతృప్తికరంగా కురుస్తాయని, కరువు పరిస్థితులకు ఆస్కారం లేదని తేల్చాయి.

ఐఎండీ తాజా లెక్కల ప్రకారం రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లానినా ప్రభావం బాగా ఉండనుంది. ఆ తర్వాత మరో మూడు నెలలు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణంగా ఉంటుంది. అంటే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే మే వరకు లానినా అనుకూలంగా ఉన్నందువల్ల సకాలంలో రుతుపవనాల ఆగమనం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత వచ్చే మూడు నెలలపాటు సాధారణ పరిస్థితులుండడం వల్ల సాధారణ వర్షాలకు అవకాశముందంటున్నారు. ఐఎండీ తాజా అంచనాలు రైతులతోపాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఊరటనివ్వనున్నాయి.

Similar News