తమిళనాడుకు ముంచుకొస్తున్న మరో ముప్పు

Update: 2018-11-20 07:49 GMT

‘గజ’ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు  మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశ మున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతికి మారిందని, ఇది మరింత స్థిరపడనుందని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయు గుండంగా మారి బలపడే అవకాశముందన్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తదితర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని సూచించారు. వచ్చే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశమున్నందున జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

అదేవిధంగా కడలూరు, నాగపట్నం, కారైక్కాల్‌, తిరువారూర్‌, తంజావూర్‌, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల విస్తారంగా, వర్షం పడే అవకాశముంది. చెన్నైలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షం పడే అవకాశముంది. ఈ ఏడాది చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 60 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

అక్టోబరు 1 నుంచి నవంబరు 19వ తేదీ వరకు రాష్ట్రం మొత్తంమ్మీద ఇప్పటికి 30 శాతం వర్షపాతం నమోదై వుండాల్సివుండగా, కేవలం 24 శాతం మాత్రమే కురిసింది. చెన్నైలో ఇప్పటివరకూ కేవలం 21 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇది వచ్చే ఏడాదిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే డిసెంబరు నెల వరకు వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణశాఖ చెబుతుండడం మాత్రం ఆశలు రేపుతోంది.

Similar News