జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 11 ప్రయోగం విజయవంతం

Update: 2018-12-19 12:15 GMT

వరుస ప్రయోగాలు, విజయాలతో నింగే హద్దుగా ఇస్రో దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే మూడు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 11 నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. భారత కాలమాన ప్రకారం షార్‌ ఈ సాయంత్రం 4.10 గంటలకు జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌11 ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్‌ఎల్‌వీ వెహికల్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్‌–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 

కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో జీశాట్‌–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్‌–7ఏ మాత్రం అడ్వాన్స్‌డ్‌ మిలటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్‌ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ లో రూపొందించారు.
 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీశాట్ 7ఏ వైమానిక రంగానికి 8ఏళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహ శ్రేణిలో జీశాట్ 7ఏ మూడోది. సమాచార వ్యవస్ధలో ఇప్పటివరకు ఇస్రో 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. తాజాగా ప్రయోగించిన ఉపగ్రహంతో భారత సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. 

Similar News