అసెంబ్లీలో కాంగ్రెస్‌ రచ్చరచ్చ.. గవర్నర్‌పైకి పేపర్లు..

Update: 2018-03-12 05:27 GMT

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి విసిరేస్తూ, నినాదాలతో పోడియంలోకి దూసుకురావడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ అడ్డుకుంటున్నా, వారిని తోసుకుంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. గవర్నర్ ఏం మాట్లాడుతున్నారన్న విషయం కూడా సరిగ్గా వినిపించని స్థాయిలో అసెంబ్లీలో రభస జరుగుతోంది. తన ప్రసంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా నరసింహన్ తన పనిని తాను చేసుకుపోయారు.

సోమవారం ఉదయం 10 గంటలకు జాతీయ గీతాలాపనతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగాన్ని చదవడం మొదలుపెట్టిన కాసేపటికే.. కాంగ్రెస్‌ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ నిల్చున్న వెల్‌లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతలోనే వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు బడ్జెట్‌ ప్రతులను చింపేసి గవర్నర్‌పైకి విసిరే ప్రయత్నం చేశారు. ప్రసంగం పూర్తైన అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. మార్చి 15న మంత్రి ఈటల బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.
 
 

Similar News