ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం

Update: 2018-02-06 11:39 GMT

తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, విభజన చట్ట ప్రకారం ఏపీకి చాలా సంస్థలు ఇచ్చామని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు. 
 
‘‘ఈఏపీ నిధులను నాబార్డ్‌ ద్వారా ఇవ్వమని సీఎం కోరుతున్నారు. ఈఏపీ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వడం వల్ల రాష్ట్రానికి అప్పు తీసుకునే సామర్ధ్యం తగ్గుతుంది. ద్రవ్యలోటు వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారంపై మల్లగుల్లాలు పడుతున్నాం. ఏపీ ఆర్ధికశాఖ కార్యదర్శితో చర్చలు జరపాలని.. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి సూచించా. రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన సూత్రం లేదు. కొత్త ఫార్ములాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. లోటు భర్తీ కింద ఇప్పటికే రూ.3,900 కోట్లు ఇచ్చాం. ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం’’ అంటూ జైట్లీ ప్రకటించారు.


 

Similar News