యూనిఫాంలోనే యోగికి పోలీసు అధికారి పూజలు

Update: 2018-07-28 07:25 GMT

ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు యూనిఫామ్ లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గోరఖ్ పూర్ సర్కిల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ సింగ్.. గురు పూర్ణిమ సందర్భంగా శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు మోకరిల్లారు. అనంతరం యోగికి తిలకం దిద్ది, పూలమాలతో సత్కరించారు. గోరఖ్‌పూర్ ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా ఉన్న యోగి పట్ల పోలీసు అధికారి భక్తిప్రపత్తులు చాటుకున్న ఈ ఘటన శుక్రవారం గురుపౌర్ణమి సందర్భంగా చోటుచేసుకుంది. ఈ ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సింగ్.. ‘నేను అదృష్టవంతుడిని’ అని స్టేటస్ ను మార్చారు.దీంతో ప్రవీణ్ సింగ్ చర్యపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. యూనిఫాం ధరించి ఆ పని చేయవచ్చా? అని కొందరు నిలదీస్తే, మరికొందరు సమర్ధించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రశ్నించవచ్చు కానీ ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హిందూ సంప్రదాయ ప్రకారం జ్యోతి ప్రజ్వలన చేసే ప్రారంభిస్తుంటారని, ఇదీ అలాంటిదేనని కొందరు సమర్ధించారు. పోలీసు అధికారులకూ భిన్నమైన విశ్వాసాలుంటాయని, మతపరమైన కార్యక్రమాల్లోనూ యూనిఫాంతోనే పాల్గొంటారని, యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడే ఐదు నిమిషాల్లో డ్రస్ చేంజ్ చేసుకోవడం ఎలా సాధ్యమని మరో నెటిజిన్ సమర్ధించాడు.

Similar News