పార్కుల్లో అలాంటి ప్రవర్తన వల్లే రేప్‌లు: బీజేపీ ఎంపీ

Update: 2017-09-20 13:56 GMT

భరత్‌పూర్: ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఒకరు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేప్ జరగడానికి గల కారణాల గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో యువతీయువకుల విచ్చలవిడి ప్రవర్తన అత్యాచారాలకు కారణమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జంట బైక్‌పై వెళుతుంటే ఒకరినొకరు కౌగిలించుకుంటూ.. ఒకరిని ఒకరు తినేస్తున్నట్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సాక్షి మహరాజ్ చెప్పుకొచ్చారు. కార్లలో, పబ్లిక్ ప్లేసుల్లో, పార్కుల్లో యువతీయువకులు చేసే పనులు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయని ఆయన చెప్పారు.

ఇలాంటి వాటన్నింటినీ ఎవరూ పట్టించుకోరని, కానీ ఎక్కడైనా రేప్ జరిగితే మాత్రం వెంటనే పోలీసులను ప్రతీ ఒక్కరూ తప్పుబడతారని, ఆ వైఖరి సరికాదని సాక్షి మహరాజ్ తెలిపారు. అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో తనకెలాంటి సన్నిహిత సంబంధాలు లేవని సాక్షి మహరాజ్ తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నికల సమయంలో బాబాలతో సన్నిహితంగా మెలుగుతున్నారని, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం డేరా బాబాను జైలుకు పంపి దొంగ బాబాల విషయంలో తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎంపీ సాక్షి మహరాజ్ సూచించారు.

Similar News