రైతు బంధు పథకం..రెవిన్యూ ఉద్యోగులకు వరం...బతికి ఉన్న రైతు చనిపోయినట్లు నమోదు

Update: 2018-07-02 09:47 GMT

రైతు బంధు పథకంలో అవినీతి రెవిన్యూ ఉద్యోగులు రాబందులుగా మారారు. లంచాలు ఇవ్వని రైతులపై కక్ష సాధిస్తున్నారు. బతికున్న రైతు చనిపోయినట్లుగా రికార్డుల్లో రాసి రైతు బంధు చెక్కు అందకుండా చేశారు. ఖమ్మం జిల్లా పినపాక మండల కార్యాలయం అవినీతి బాగోతంపై స్పెషల్ స్టోరీ. 

రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం  రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. రైతు బంధు పథకాన్ని  అవినీతి రెవిన్యూ ఉద్యోగులు తూట్లు పొడుస్తున్నారు. రైతులకు లంచాలు డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వకపోతే రికార్డులు తారుమారు చేసి రైతులను వేధిస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక తహశీల్దార్ కార్యాలయం. పొట్లపల్లి వీఆర్వోగా కృష్ణారావు పని చేస్తున్నారు. దివంగత ఎల్లయ్యకు 13 ఎకరాల పొలం ఉంది. ఎల్లయ్యకు ఉప్పలయ్య తో పాటు మరో కుమారుడు  ఉన్నాడు. రెండేళ్ల క్రితం ఎల్లయ్య మృతి చెందారు. రైతు బందు పథకంలో వారసత్వ పట్టా చేసేందుకు వీఆర్వో కృష్ణారావు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఉప్పలయ్య మృతి చెందినట్లు రికార్డులో రాశాడు. పాస్ బుక్ , చెక్ లను క్యాన్సల్ అని రాశారు. దీంతో ఉప్పలయ్య లబోదిబోమంటున్నాడు. 

ఉప్పలయ్య భూమి పక్కనే శ్రీనివాస రావు భూమి ఉంది. లంచం డబ్బులు ఇవ్వనందుకే ఉప్పలయ్య మృతి చెందినట్లు రికార్డులో రాశారు అని చెబుతున్నారు. వీఆర్వో కృష్ణారావు అవినీతి ఉద్యోగి అని, లంచం ఇవ్వకుంటే రికార్డులు తారుమారు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. 

రైతు ఉప్పలయ్య ఆరోపణలను రెవిన్యూ ఉద్యోగులు త్రోసిపుచ్చుతున్నారు. వీఆర్వో కృష్ణారావు అయితే..ఇంతవరకూ తాను ఉప్పలయ్యను కలువలేదని వాదిస్తున్నారు. లంచం ఆరోపణలతో తనను రైతులు బద్నాం చేస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మార్వో ఉప్పలయ్య భూమికి సంబంధించి మరో వాదన వినిపిస్తున్నారు. రైతు బంధు పథకంలో అక్రమాలు చోటు చేసుకోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్న లంచగొండి ఉద్యోగులపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Similar News