మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు...ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న నూతన సారథులు

Update: 2018-12-17 04:56 GMT

మూడు రాష్ట్రాలకు సారథులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు నూతన ముఖ్యమంత్రులు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాలకు రానున్నారు. 

సెమీఫైనల్స్‌గా భావించిన ఎన్నికల్లో బంపర్ హిట్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తుల తర్వాత ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎన్నుకుంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 10 గంటలా 15 నిముషాలకు రాజస్థాన్‌ సీఎంగా అశోక్ గెహ్లాట్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడో సారి ప్రమాణస్వీకారం చేయనున్న గెహ్లాట్‌ తో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జైపూర్‌లోని అల్బర్ట్‌ హాల్‌ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిముషాలకు కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి భోపాల్‌లోని జంబూరి మైదాన్‌లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 

అలాగే సాయంత్రం 4 గంటలా 30 నిముషాలకు ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రిగా భూపేశ్‌ భగేల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూడు ప్రమాణస్వీకార కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరవుతున్నారు. అలాగే ఏఐసీసీ ఆహ్వానం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాలకు వస్తున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కూడా ఈ కార్యక్రమాలకు వెళ్లనున్నారు. 

Similar News