టీడీపీ ఎంపీలూ.. ప్లకార్డులు మాకు కాదు ప్రధానికి చూపండి!

Update: 2018-02-06 11:49 GMT

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో ఆందోళన బాటపట్టిన టీడీపీ ఎంపీలు వ్యూహం మార్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడానికి అసలు కారణం కాంగ్రెస్సేనంటూ మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీకి ఈ గతి పట్టడానికి కాంగ్రెస్సే కారణమన్న టీడీపీ ఎంపీలు..... ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సోనియాగాంధీ ముందే గొడవకు దిగారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభ కెమెరాలో ఖర్గే కనిపించకుండా ప్లకార్డులు అడ్డుపెట్టారు.

అయితే టీడీపీ ఎంపీల తీరుపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీజేపీనే ఇలా టీడీపీ ఎంపీలతో ఆందోళన చేయిస్తోందని, బీజేపీ తన తప్పును కాంగ్రెస్‌పైకి నెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు తమ ముందు కాదు.. ప్రధాని మోదీ ముందు ప్రదర్శించాలని ఖర్గే సూచించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్లమెంటులో ఆందోళనకు దిగడంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం రాజ్యసభ జరిగిన తీరుకు నిరసనగా సభను విపక్షాలు బహిష్కరించాయి. 

Similar News