పద్యాలు, గేయాలతో అలరించిన ముఖ్యమంత్రి ప్రసంగం

Update: 2017-12-16 05:56 GMT

ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక వేడుకల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఓ ఉద్యమకారుడిలా, రాజకీయ నేతలా కాకుండా గొప్ప సాహీతీ వేత్తగా కనిపించారు. కేసీఆర్ చేసిన ప్రసంగం సాహితీవేత్తలు, రచయితలు, భాషాభిమానులు, ఆహుతుల నీరాజనాలు అందుకుంది

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆహూతులతోపాటు ప్రజలను ఆకట్టుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తనకు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మను సత్కరించి, కాళ్లకు నమస్కరించారు. కేసీఆర్ తన ప్రసంగంలో అలనాటి మహాకవుల నుంచి ఈ తరం కవుల వరకు అందరిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు.  పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన నుంచి మొదలుకొని.. దాశరథి, కాళోజి, సినారె తదితరులను సాహిత్యాన్ని సృశిస్తూ.. వారి కవితలు, పద్యాలను వల్లెవేశారు. శతక పద్యాలతో సామాన్యులకు సైతం సులువుగా అర్ధమయ్యేలా తమ రచనలను మలచిన శతక కారులు గుర్తు చేయడమే కాదు వారి పద్యాలను పాడి అందులోని మాధుర్యాన్ని సభికులకు పంచారు కేసీఆర్.

ఈ తరం పల్లె కవులు  గోరేటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్ లాంటి వారి గురించి చెబుతూ వారి పాటలు, పద్యాలను కూడా గుర్తు చేశారు. సందు చిన్నదీ సంత మావూరి సంత జయ జయహే తెలంగాణ.., వానమ్మా వాన..అంటూ సీఎం కేసీఆర్ అలవోకగా పాడి సభికులను సంభ్రమాశ్చర్యాల్లో తేలియాడేలా చేశారు. సందర్భోచితంగా కేసీఆర్ చెప్పిన పద్యాలు, సామెతలు, నుడికారాలు ఆయనలోని సాహితీవేత్తను కొత్త కోణంలో ఆవిష్కరించాయి. తొమ్మిదో తరగతిలోనే పద్యాలు రాసిన విషయం, చిన్నప్పుడు నటుడు శోభన్‌బాబు సినిమాలో ఓ పాటలో వాడిన పద ప్రయోగంలో వచ్చిన సంశయాన్ని మరునాడు గురువుని అడిగి దాన్ని నివృత్తి చేసుకున్న విధానం అందరిలో ఆసక్తితోపాటు చదువుకునే సమయంలోనే కేసీఆర్‌లో శ్రద్ధను వివరించాయి.
మొత్తానికి తెలుగు సౌరభాన్ని దశదిశలా వ్యాప్తి చేసేందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముందడుగు వేయడమే కాదు అందులోని మాధుర్యాన్ని కూడా వివరించి తొలి రోజు వేడుకలకు పరిపూర్ణత తీసుకొచ్చారు. 

Similar News