ఒకరి జిల్లాలో మరొకరి పర్యటన

Update: 2018-01-03 12:59 GMT

మీ ఊరొచ్చా అని వైఎస్‌ జగన్‌తో అనకపోయినా.. సీఎం చంద్రబాబు పులివెందులలో జన్మభూమి సభ పెట్టారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. ఒకరి జిల్లాలో మరొకరు ఒకే సమయంలో అధికార, విపక్ష నేతలు పర్యటించడం అరుదైందే. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. ఇడుపుల పాయ నుంచి మొదలెట్టి అనంతపురం మీదుగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం సొంత జిల్లాలో పాదయాత్ర చేస్తూ వైసీపీ అధినేత విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని జగన్‌ విమర్శిస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌ చిత్తూరుజిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని పులివెందులలో నిర్వహించింది. స్థానిక సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడమే లక్ష‌్యంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు పాల్గొనడంతో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం సొంత జిల్లాలో.. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి కూడా రాకుండా పర్యటిస్తుండడం, అదే సమయంలో వైఎస్‌ జగన్‌ సొంత నియోజక వర్గంలో సీఎం చంద్రబాబు కార్యక్రమం పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. జన్మభూమి కార్యక్రమాన్ని పులివెందుల స్థానిక శాసన సభ్యుడైన వైఎస్‌ జగన్‌ లేని సమయంలో నిర్వహించడమేంటని వైసీపీ విమర్శిస్తుంటే, అంతా ప్రోటోకాల్‌ ప్రకారమే జరిగిందని అధికార పార్టీ సభ్యులు సమర్థించుకుంటున్నారు. 

Similar News