కర్నాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-05-29 05:26 GMT

కర్నాటక ప్రజలు జేడీఎస్‌‌కు అధికారమివ్వలేదు.... కాంగ్రెస్‌ దయవల్లే ముఖ్యమంత్రినయ్యా.... ఎవరేమనుకున్నా కాంగ్రెస్‌ ఏం చేబితే అదే చేస్తానంటూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కన్నడనాట సంచలనంగా మారాయి. ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానంటూ ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.... కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లే నడుచుకుంటాననడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకుని... అనూహ్య పరిస్థితుల్లో... కాంగ్రెస్‌ మద్దతుతో కర్నాటకలో సంకీర్ణ సర్కార్‌‌... ఏర్పాటు చేసిన జేడీఎస్‌ కుమారస్వామి... ఐదేళ్లూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి... అత్యంత లౌక్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధిష్టానం మెప్పు పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఒకసారి... ప్రమాణస్వీకారం తర్వాత మరోసారి.... సోనియా, రాహుల్‌ను కలిసిన కుమారస్వామి.... కాంగ్రెస్‌‌కు నమ్మిన బంటుననే సంకేతాలు పంపారు. కాంగ్రెస్‌ దయ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యాయన్న కుమారస్వామి... కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానంటూనే కాంగ్రెస్‌ పట్ల తనకున్న కమిట్‌మెంట్‌ను చాటుకునే ప్రయత్నం చేశారు.

ఆరున్నర కోట్ల ప్రజల తీర్పుతో కాదు కాంగ్రెస్‌ దయ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానంటూ కుమారస్వామి చేసిన కామెంట్స్‌ కన్నడనాట సంచలనంగా మారాయి. కన్నడ ప్రజలకు కుమారస్వామి తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు బీజేఎల్పీ నేత యడ్యూరప్పు. ప్రజలకు సేవ చేస్తానంటూ ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లు పనిచేస్తాననడం దారుణమన్నారు.

ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానంటూ చెప్పడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. కుమారస్వామి వ్యాఖ్యలు రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.

Similar News