బైక్ అంబులెన్సులు ఏమయ్యాయాబ్బా....!!

Update: 2018-05-08 07:41 GMT

ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమయాల్లో.. బాధితులను కాపాడేందుకు.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బైక్ అంబులెన్సులు మూలపడ్డాయి. ముఖ్యంగా ఇరుకు సందులు ఎక్కువగా ఉండే
హైదరాబాద్ వంటి మహానగరంలో ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే.. వారిని త్వరగా ఆస్పత్రికి చేర్చేందుకు బైక్ అంబులెన్సులు సమర్థవంతంగా ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించింది. ఆటోలు కూడా వెళ్లలేని గల్లీల్లో.. అంబులెన్సు ద్వారా సేవలు అందించలేని సమయంలో.. బైక్ అంబులెన్సుల ద్వారా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది.

నాలుగు నెలల క్రితం సంబరంగా ప్రారంభమైన బైక్ అంబులెన్సులు.. దాదాపు పనిచేయడం మానేశాయి. వాహనాలను నిలిపేందుకు సరైన షెల్టర్లు లేకపోవడం.. రోజంతా రోడ్లపైనే నిల్చొని ఉండాల్సి రావడం.. వాహనాల్లో తరచూ సాంకేతిక లోపాలు రావడం.. తదితర కారణాలతో శిక్షణ పొందిన అభ్యర్థులు బైక్ ఎక్కేందుకు ఇష్టపడట్లేదు.

సర్వీసులు ప్రారంభమై 120 రోజులు దాటినా ఇంతవరకు గరిష్టంగా వంద కేసులు కూడా రాలేదంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుమారు లక్షన్నర ఖర్చు పెట్టి.. 50 బైకులను కొన్న ప్రభుత్వం.. వీటికి ప్రత్యేక కిట్‌లను అమర్చింది. బీఎస్సీ చదివి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి శిక్షణ ఇచ్చి ఈఎంటీలుగా నియమించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలందిస్తామన్న ప్రభుత్వం రైడర్స్‌కు కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. దీంతో సుమారు 90 శాతం మంది ఈఎంటీలు పనిమానేయడంతో.. బైక్ అంబులెన్సులు దాదాపుగా మూలకు చేరాయి.

అయితే బైక్ అంబులెన్సులు పనిచేయడం లేదనే వాదనలో వాస్తవం లేదని.. 108 అధికారులు చెబుతున్నారు. పెద్ద అంబులెన్సులతో పోలిస్తే.. వీటికి రెస్పాన్స్ తక్కువే అంటున్న అధికారులు.. నిత్యం 40 కేసులకు పైగానే అటెండ్  అవుతున్నట్లు వివరించారు.

 

Similar News