ఆకాశంలో అవని

Update: 2018-02-22 09:23 GMT

ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళాలోకం అక్కడక్కడా మిగిలివున్న క్లిష్టమైన రంగాల్లోనూ అడుగుపెట్టి ఘనవిజయాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే దేశంలో తొలిసారి యుద్ధవిమానాన్ని నడిపించే మహిళగా అరుదైన ఘనత సాధించింది మధ్యప్రదేశ్ యువతి. 

ఫైటర్ విమానాలు నడపడమంటే అదో సాహసం. అందుకే ఇంతవరకు దేశంలో పురుషులే తప్ప మహిళలు ఆ రంగంలో అడుగుపెట్టలేదు. కానీ అన్ని రంగాల్లో ముందుండే మహిళలు ఇక్కడెందుకు తగ్గాలి? అంటూ ఓ యువతి ముందుకొచ్చింది. దేశంలో తొలి మహిళా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైలెట్ గా అవని చతుర్వేది రికార్డు సృష్టించింది. 

జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి ఒంటరిగా 30 నిమిషాల పాటు మిగ్-21 సూపర్ సోనిక్ యుద్ధ విమానాన్ని అవని నడిపింది. మహిళా జెట్ ఫైలట్ల శిక్షణను ప్రయోగాత్మకంగా చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 2016 నుంచి అవనితోపాటు మరో ఇద్దరు యువతులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకోగా, తొలిసారి అవని ధైర్యసాహసాలతో యుద్ధవిమానాన్ని నడిపింది. 

మధ్యప్రదేశ్ లోని దియోలాండ్ కు చెందిన అవని.. సవాళ్లతో కూడిన తన వృత్తిలో ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉన్నానని, తాను సాధించిన ఘనతకు తల్లిదండ్రులు, ఐఏఎఫ్ అధికారులు కారణమని చెప్పింది. అవనితోపాటు భావనాకాంత్, మోహనా సింగ్ అనే మరో ఇద్దరు యువతులు కూడా ఫైటర్ విమానం నడిపేందుకు కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. 

Similar News