షాకింగ్‌ : కారు ఆపలేదని.. కాల్చేసిన కానిస్టేబుల్‌

Update: 2018-09-29 07:36 GMT

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కారు ఆపలేదని ఓ వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్‌ ఏకంగా కాల్చిచంపేశాడు. ఆపిల్‌ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వివేక్‌ తివారీ అనే వ్యక్తి శుక్రవారం ఆఫీస్‌ విధులు ముగించుకుని అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో అతన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకున్నా తివారీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా కారును ముందుకు తీసుకెళ్లాడు. అంతే వెంటనే ఓ కానిస్టేబుల్‌ తన గన్‌ను తీసుకొని తివారీపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వివేక్‌ తివారీ ప్రాణాలు కోల్పోయాడు. 

గోమతీ నగర్‌ ఎక్స్‌ టెన్షన్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. దీంతో వివేక్‌ తివారీ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన భర్తను కాల్చాల్సిన హక్కు పోలీసులకు ఎక్కడిదంటూ వివేక్‌ భార్య కల్పన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కారును ఆపకుండా నడపటంతో అనుమానించిన కానిస్టేబుల్‌ కాల్పులు జరిపాడని అంతలోనే వివేక్‌ కారు డివైడర్‌కు ఢీ కొట్టిందని లక్నో డీఎస్‌పీ తెలిపారు. అ సమయంలో తీవ్ర గాయాలైన వివేక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. 

అయితే పోలీసులు మాత్రం పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే తదుపరి చర్యలుంటాయని చెబుతున్నారు. ఒకవేళ బుల్లెట్‌ గాయాలవల్లే వివేక్ తివారీ మరణించాడని పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అది హత్యానేరం కింద పరిగణింపబడుతుందని డీఎస్‌పీ తెలిపారు. అయితే కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ మాత్రం ఆత్మరక్షణ కోసమే షూట్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 

Similar News