భగభగ మండిపోతున్న ఇద్దరు చంద్రులు

Update: 2018-03-08 05:22 GMT

ఇద్దరు చంద్రులు.. ప్రఛండ భానుడిలా మారిపోయారు. ఎలాంటి వాతావరణంలోనైనా శాంతంగా, ప్రశాంతంగా స్పందించే చంద్రద్వయం.. ఇప్పుడు భగభగ మండే నిప్పు కణికల్లా ఎగసిపడుతున్నారు. కమ్ముకున్న నీలి నీడలను చీల్చుకు రావాలని ఒకరు.. మరింత ఎత్తుకు దూసుకుపోయి, తన ప్రాభవాన్ని చాటాలని మరోకరు. ఇలా ఫైర్ బాంబ్స్ లా మారిపోయారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు భగభగ మండిపోతున్నారు. తమ పొలిటికల్ కేరియర్ అంతా తెరచిన పుస్తకమని రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతికి, అన్యాయానికి పాల్పడలేదని చెప్పే ప్రయత్నంలో ఇరువురు ముఖ్యమంత్రులు మండే చంద్రులుగా మారిపోయారు. తమ రాజకీయ ప్రస్థానం అద్యంతం మచ్చలేని ప్రయాణమని చెప్పే క్రమంలో ఇద్దరు చంద్రులు నిప్పులు కక్కుతున్నారు. విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో నిప్పు కణికల్లా మారిపోతున్నారు. 

విభజన హామీలు, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మూడు గంటల పాటు వివరణ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు హక్కుల సాధనలోఎక్కడా రాజీపడలేదన్నారు. తన జీవితంలో ఎప్పుడు లాలూచీ రాజకీయాలు చేయలేదని చెప్పారు. తాను నిప్పులాంటి వాడినని తనపై ఎలాంటి కేసులు లేవన్నారు. తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు తెలిపారు. 

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవల విపక్షాలపై తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. తనను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని ఒకవేళ టచ్ చేస్తే, భస్మం అయిపోతారని చెప్పారు. తానింతవరకూ ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని తెలిపారు. 

పొలిటికల్ జర్నీలో విమర్శనాస్త్రాలు, డైలాగ్ వార్స్ సర్వసాధారణం. అందులోనూ చంద్రబాబు, కేసీఆర్ లాంటి సీనియర్ పొలిటీషియన్ల విషయంలో కాస్త ఎక్కువగానే ఉంటాయి. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఇద్దరు చంద్రులు దిట్టలే. అయితే, ఇప్పుడు మాత్రం మండే చంద్రులుగా మారిపోయి.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేశారు. 

Similar News