ఓటమితో డీలా పడ్డ పళని, పన్నీర్.. దినకరన్ కు పళని, పన్నీర్ దీటుగా బదులిస్తారా?

Update: 2017-12-26 06:43 GMT

ఆర్కే నగర్ లో జయ వారసుడుగా దినకరన్ కు ప్రజలు పట్టం కట్టినట్లే భావించాలా? దినకరన్ గెలుపుతో శశికళ వర్గం పై చేయి సాధించినట్లేనా? మూడు నెలల్లో ప్రభుత్వం కుప్ప కూలుతుందన్న దినకరన్ వ్యాఖ్యలు ఎవరికి చేసిన హెచ్చరికలు.

ఆర్కే నగర్ ఉప ఎన్నిక అన్నా డిఎంకేకు పెద్ద ఎదురు దెబ్బగా పరిణమించింది. అన్నా డిఎంకే అభ్యర్ధి మధు సూదనన్ ఓటమి పళనీ, పన్నీర్ వర్గాలకు ఊహించని షాక్ ఉప ఎన్నిక ముందు జరిగినచిత్ర విచిత్రాలు అన్నాడిఎంకేలో ఉన్న కుమ్ములాటలను బయటపెట్టాయి. నటుడు విశాల్ దినకరన్ వర్గం అండతోనే బరిలోకి దిగుతున్నాడంటూ ఆరోపించిన మధుసూదన్ వర్గం విశాల్ పోటీలో లేకుండా  వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇక సెంటిమెంట్ తో  గెలవాలనుకున్న దీప నామినేషన్ దశలోనే బరినుంచి వైదొలగింది. నువ్వా నేనా అన్న స్థాయిలో జరిగిన ఈ బై పోల్ లో దినకరన్ వర్గం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసింది. ఓటర్లకు భారీగా నగదు, ఇతర తాయిలాలు ఎర వేయడమే కాదు చివరి నిమిషంలో జయ ఆస్పత్రిలో ఉన్న వీడియోను బహిర్గతం చేసి  ప్రలోభాలను క్లైమాక్స్ కి చేర్చింది దినకరన్ వర్గం జయ మృతికి తామే కారకులమంటూ వస్తున్న ఆరోపణలకు ఇదే సమాధానం అన్న దినకరన్ త్వరలోనే మరిన్ని వీడియోలు బయటపెడతామన్నారు.

అంతేకాదు అన్నాడి ఎంకేలో కొందరు ఎమ్మెల్యేలను, ద్వితీయ స్థాయి నేతలను  డబ్బుతో తనవైపు తిప్పుకోడం వల్లనే దినకరన్ ఈ ఎన్నికలను గెలవ గలిగారు. జయ వారసులం తామేనంటూ మరింత ఎక్కువగా దినకరన్ ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను మళ్లీ తమవైపు తిప్పుకుని సర్కార్ ను కూల్చడం ద్వారా అధికారం చేజిక్కించుకుంటామని దినకరన్ వర్గం బాహాటంగానే ప్రకటించింది దినకరన్ కు బాసటగా నిలిచిన జిల్లా ఇన్చార్జులు, ఎమ్మెల్యేలను అన్నా డిఎంకే నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ముందు సర్కార్ ను కూల్చడం ఆ తర్వాత పార్టీ గుర్తును చేజిక్కించుకుని తమదే అసలైన అన్నా డిఎంకేగా ప్రకటించుకునేందుకు శశికళ వర్గం వేగంగా పావులు కదుపుతోంది దినకరన్ ఎత్తులను ప్రతిఘటించాలంటే పళని,పన్నీర్ సంఘటితంగా పోరాడాల్సి ఉంటుంది. కాని వారిద్దరి మధ్య సఖ్యత ఎన్నాళ్లుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Similar News