వయసు 96.. మార్కులు 98

Update: 2018-11-02 04:51 GMT

మనో బలం ముందు వయో భారం గడ్డి పోచ వంటిదని నిరూపించిన బామ్మను కేరళ ప్రభుత్వం సత్కరించింది. అక్షరలక్షం అక్షరాస్యత కార్యక్రమంలో జరిగిన పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించిన కార్తియాని అమ్మను ముఖ్యమంత్రి పినరయి విజయన్ సన్మానించారు. 

విజ్ఞానాన్ని సంపాదించడానికి వయసుతో సంబంధం లేదని కార్తియాని అమ్మ నిరూపించారు. అలపుళ జిల్లాకు చెందిన ఆమె 96 ఏళ్ళ వయసులో అక్షరాలు దిద్దుతూ అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. తనను ప్రభుత్వం సత్కరించిన అనంతరం కార్తియాని మీడియాతో మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడం చూసి తాను ప్రేరణ పొందానన్నారు. తన చిన్నతనంలో తనకు చదువుకునే అవకాశం రాలేదన్నారు. ఒకవేళ చిన్నప్పుడే చదువుకుని ఉంటే తాను ప్రభుత్వాధికారిని అయి ఉండేదానినని చిరు మందహాసంతో చెప్పారు. ఇప్పుడు తనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించాలని ఉందని, కంప్యూటర్స్ నేర్చుకుంటానని తెలిపారు.

కార్తియాని మరొక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. తాను పరీక్షల్లో కాపీ కొట్టలేదన్నారు. తాను రాసినదానిలో ఇతరులు కాపీ కొట్టడానికి అవకాశమిచ్చానన్నారు. ఏం రాయాలో కొందరికి తానే చెప్పానన్నారు. కార్తియాని తన క్లాస్‌మేట్స్‌లో అత్యంత పెద్ద వయసుగల వ్యక్తిగా రికార్డు సృష్టించారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో అక్షర లక్షం పరీక్ష జరిగింది. రాయడంలో ఆమెకు 40కి 38 మార్కులు లభించాయి. చదవడం, లెక్కలు పరీక్షల్లో ఆమె నూటికి నూరు శాతం మార్కులు సాధించారు.

Similar News