మావోయిస్టుల దుశ్చర్య.. బస్సుపై బాంబు..

Update: 2018-11-09 02:43 GMT

 ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బస్సుపై బాంబు దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దంతెవాడ జిల్లాలోని బచేలీ సమీపంలో జరిగింది. బాంబు ఘటనలో సీఐఎస్‌ఎఫ్‌‌ జవాన్‌ కూడా ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో  మావోల బాంబు దాడి అధికారులకు టెన్షన్ తెప్పిస్తోంది. 

ఇదే జిల్లాలో మావోయిస్టులు దాడి చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడంతో అధికారులంతా హైఅలర్ట్ అయ్యారు. ఇదిలావుంటే అక్టోబరు 30న ఎన్నికల ఏర్పాట్లపై కవరేజ్‌కు వెళ్లిన దూరదర్శన్‌ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతిచెందగా..  భద్రతగా వెళ్లిన ముగ్గురు భద్రతాసిబ్బంది కూడా మృతిచెందారు. కాగా నక్సల్స్‌‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 18 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. 

Similar News