Rs 10 Notes: మాయమైపోతున్న 10 రూపాయల నోట్లు.. ఇక నుంచి కనిపించవా..?

Rs 10 Notes: మాయమైపోతున్న 10 రూపాయల నోట్లు.. ఇక నుంచి కనిపించవా..?

Update: 2025-12-27 01:16 GMT

Rs 10 Notes: భారతీయ ఆర్థిక వ్యవస్థలో 10 రూపాయల నోటుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది చిన్న మొత్తాల లావాదేవీలకు ఆధారంగా నిలుస్తూ.. సామాన్యుడి రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారింది. ఉదయం పాలు కొనడం నుంచి బస్సు ఛార్జీ చెల్లించేవరకు, వీధి వ్యాపారి దగ్గర నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతి చోట ఈ నోటు అవసరం తప్పనిసరి అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరి జేబులో కనీసం ఒక పది రూపాయల నోటు ఉండాలని అనుకునే పరిస్థితి ఏర్పడింది.

అయితే.. ఇటీవల కాలంలో కొత్త 10 రూపాయల నోట్లు మార్కెట్‌లో కనిపించడం చాలా అరుదుగా మారింది. కొత్తగా మెరిసే రూ.10 నోటు కనిపిస్తేనే జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిల్లర నోట్ల లభ్యత తగ్గిపోవడంతో ప్రజలు పాతవి.. చిరిగిపోయినవి.. మురికిగా మారిన నోట్లనే వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న మొత్తాల లావాదేవీల్లో చిల్లర లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ కొరత ప్రభావం ఎక్కువగా చిన్న వ్యాపారులపై పడుతోంది. కూరగాయలు అమ్మేవారు, టీ స్టాల్లు, కిరాణా షాపుల యజమానులు పది రూపాయల నోట్ల లేమితో సతమతమవుతున్నారు. కస్టమర్లు పెద్ద నోట్లు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడానికి సరైన చిల్లర లేక అమ్మకాలు నిలిచిపోతున్నాయి. కొన్నిసార్లు కస్టమర్లు కొనుగోలు చేయకుండానే వెళ్లిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. దీనివల్ల రోజువారీ ఆదాయంపై ఆధారపడే అల్పాదాయ వర్గాలకు నష్టం వాటిల్లుతోంది.

పది రూపాయల కాగితపు నోట్ల మన్నిక కూడా పెద్ద సవాలుగా మారింది. ఈ నోట్లు చాలా త్వరగా పాడైపోతాయి. తరచూ చేతులు మారడం, చెమట, తేమ, మడతలు పడటం వంటివి వీటి జీవిత కాలాన్ని మరింత తగ్గిస్తున్నాయి. కొన్ని రోజులకే ఇవి చిరిగిపోవడం, ముక్కలవడం జరుగుతుంది. అలా పాడైపోయిన నోట్లను ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడరు. ఫలితంగా, ప్రభుత్వం ఎంతమాత్రం కొత్త నోట్లు విడుదల చేసినా, అవి చాలా తక్కువ సమయంలోనే చలామణికి పనికిరాకుండా మారుతున్నాయి. ఇదే సమయంలో రూ.10, రూ.20 నాణేలు మాత్రం మార్కెట్‌లో విరివిగా కనిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి కూడా ఈ నోట్ల నిర్వహణ భారంగా మారుతోంది. ఒక పది రూపాయల నోటును ముద్రించడానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతుందని అంచనా. నోటు విలువతో పోలిస్తే ఇది పెద్ద మొత్తం కాకపోయినా, తరచూ ముద్రించాల్సి రావడం వల్ల రిజర్వ్ బ్యాంక్‌పై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం కాగితపు నోట్ల కంటే నాణేల వినియోగాన్ని పెంచే దిశగా ఆలోచిస్తోంది.డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ అవి సాధ్యపడడం లేదు. యూపీఐ లావాదేవీలు పెరిగిన మాట నిజమే కానీ, ప్రతి చిన్న ఖర్చుకు ఫోన్ ఉపయోగించడం అందరికీ అలవాటు కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం పరిమితంగా ఉండటం, వృద్ధులు, కూలీలు వంటి వారికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల నగదే ప్రధాన ఆధారం. ఈ వర్గాలకు పది రూపాయల నోటు లేకుండా రోజు గడవడం కష్టమే అని చెప్పాలి.

నాణేలు జేబులో బరువుగా ఉంటాయని, నోట్లు సులభంగా పెట్టుకోవచ్చని చాలామంది భావిస్తారు. అంతేకాదు, పండగలు, శుభకార్యాలు, మొక్కులు, బహుమతుల కోసం కూడా కొత్త పది రూపాయల నోట్లకే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ నోటుకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను తగ్గించాలంటే రిజర్వ్ బ్యాంక్ తగిన సంఖ్యలో కొత్త పది రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా ప్రజలకు ఈ నోట్లు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలి. చిల్లర సమస్య పరిష్కారమైతేనే సామాన్యుడి రోజువారీ ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. నగదు కొరత లేని వ్యవస్థను నిర్మించడమే ప్రజలకు నిజమైన ఉపశమనం కలిగించే మార్గం అవుతుంది.

Tags:    

Similar News