Richest Person Bangladesh: బంగ్లాదేశ్‌లో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీతో పోలిస్తే ఆయన సంపద ఎంత?
Richest Person Bangladesh: బంగ్లాదేశ్‌లో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీతో పోలిస్తే ఆయన సంపద ఎంత?
Richest Person Bangladesh: ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా బంగ్లాదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. అయితే ఈ రాజకీయ పరిణామాలకు మించి.. ఆ దేశంలో బంగ్లాదేశ్ ముఖేష్ అంబానీ గా పేరుగాంచిన ఓ శక్తివంతమైన కార్పొరేట్ వ్యక్తి ఉన్నాడు. అతడే మూసా బిన్ షంషేర్. అసాధారణ వ్యాపార ప్రయాణం.. అపారమైన సంపద.. వివాదాలతో కూడిన జీవితం వల్ల ఆయన బంగ్లాదేశ్‌లో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు.
మూసా బిన్ షంషేర్‌ను బంగ్లాదేశ్‌లో అత్యంత ధనవంతుడిగా పరిగణిస్తారు. ఆయనను అనుచరులు ప్రిన్స్ మూసా అని కూడా పిలుస్తారు. దక్షిణాసియాలో చాలామంది బిలియనీర్లు తయారీ, రిటైల్ లేదా వినియోగదారుల వ్యాపారాల ద్వారా ఎదిగితే.. మూసా బిన్ షంషేర్ ప్రయాణం మాత్రం పూర్తిగా భిన్నమైన దారిలో సాగింది. అనేక దేశాల్లో వ్యాపారాలు చేసి, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకున్నారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, మూసా బిన్ షంషేర్ నికర విలువ సుమారు 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఇతర వ్యాపారవేత్తల సంపదను చాలా దాటిపోయింది. అయితే భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీతో పోలిస్తే.. అంబానీ వ్యక్తిగత నికర విలువ సుమారు రూ.10 లక్షల కోట్లుగా.. ఆయన కంపెనీల మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ లెక్కన అంబానీ సంపద, మూసా అంచనా సంపద కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంది.
మూసా బిన్ షంషేర్ DATCO గ్రూప్ వ్యవస్థాపకుడు. 1970ల ప్రారంభంలో DATCO ప్రైవేట్ లిమిటెడ్‌గా ప్రారంభమైన ఈ సంస్థ మొదట సాధారణ వాణిజ్య వ్యాపారంగా మొదలైంది. తరువాత ఇది మానవ వనరుల ఎగుమతి, అంతర్జాతీయ బ్రోకరేజ్ రంగాల్లోకి విస్తరించింది. బంగ్లాదేశ్ నుంచి కార్మికులను మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్ దేశాలకు పంపే ప్రక్రియలో DATCO కీలక పాత్ర పోషించింది. ఈ రంగంలో బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో ఆయన పాత్ర ఉందని చెబుతారు.
మూసా బిన్ షంషేర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఆయన చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలే. 1970లు, 1980ల కాలంలో అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో పాల్గొన్నానని, ఇరాన్–ఇరాక్ యుద్ధం వంటి సంఘర్షణల సమయంలో భారీగా లాభాలు ఆర్జించానని ఆయన పలుమార్లు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్పష్టమైన ఆధారాలు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. అదే విధంగా.. స్విస్ బ్యాంకుల్లో తనకు భారీ మొత్తంలో నిధులు ఉన్నాయని మూసా బిన్ షంషేర్ చేసిన ప్రకటనలు కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ వాదనలు అధికారికంగా నిరూపితం కాకపోవడంతో అనేక అనుమానాలు, వివాదాలు కొనసాగుతున్నాయి.మొత్తంగా మూసా బిన్ షంషేర్ జీవితం సంపద.. వ్యాపార తెలివి.. అంతర్జాతీయ ప్రభావంతో పాటు వివాదాలతో కూడిన ఒక అసాధారణ కథగా నిలుస్తోంది.