హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లోకి ట్రంప్.. కోకాపేటలో ట్రంప్ టవర్ల నిర్మాణం
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి కొత్త ఊపు రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌నకు చెందిన రియల్ ఏస్టేట్ కంపెనీ నగరంలోనే అత్యంత ఎత్తైన టవర్లను నిర్మించనుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లోకి ట్రంప్.. కోకాపేటలో ట్రంప్ టవర్ల నిర్మాణం
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి కొత్త ఊపు రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌నకు చెందిన రియల్ ఏస్టేట్ కంపెనీ నగరంలోనే అత్యంత ఎత్తైన టవర్లను నిర్మించనుంది. కోకాపేటలో నిర్మించనున్న ఈ 63 అంతస్తు టవర్లకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం ట్రంప్ కంపెనీ ఇప్పటికే ముంబై, పుణె, గుర్గావ్, కోల్‌కతా వంటి నగరాల్లో టవర్లు నిర్మించింది. మరోవైపు ముకేశ్ అంబానీ సైతం హైదరాబాద్‌లోకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ట్రంప్, అంబానీ టవర్లుపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ మనకు అమెరికా అధ్యక్షునిగానే తెలుసు. కానీ ఆయన రాజకీయాల్లోకి రాకముందు విజయవంతమైన వ్యాపారి. ముఖ్యంగా రియల్ ఏస్టేట్ రంగంలో ఉన్న ట్రంప్ అమెరికాలోకి ప్రధాన నగరాల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలను నిర్మించారు. అనేక దేశాల్లో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ భారత్‌లో విస్తరించేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ముంబయి, పుణె, గుడ్‌గావ్, కోల్‌కతాలో ఇప్పటికే టవర్లను నిర్మించింది. దక్షిణాదిలో అడుగు పెట్టేందుకు స్థానిక నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఆరేడు వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలనేది వారి ఆలోచన. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని కోకాపేటలో ట్రంప్ టవర్ల నిర్మాణానికి స్థానిక నిర్మాణ సంస్థ ఐరా రియాల్టీతో జతకట్టింది. ఇందుకు అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. రెండు వారాల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
కోకాపేటలో 63 అంతస్తుల్లో జంట టవర్లను నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కానుంది. ఇప్పటికే కోకాపేటలో అత్యంత ఎత్తైన భవనం ఒకటి 57 అంతస్తులను పూర్తిచేసింది. ఇదే స్థాయిలో నిర్మించేలా మరికొన్ని సంస్థలు అనుమతుల కోసం దరఖాస్తు చేశాయి. భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరనుంది. తద్వారా అమెరికా బయట అత్యధికంగా ట్రంప్ టవర్లు భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌లోని కోకాపేట్ భూములకు అత్యంత డిమాండ్ ఉంది. ఎకరం కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక్కడ భూమి బంగారం. ఇప్పటికే కోకాపేట్‌లో భారీ ఎత్తున ఆకాశహార్మ్యాలు నిర్మించారు. వీటికి తోడుగా ట్రంప్ టవర్ కూడా కూడా రాబోతోంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టంబరు నెలలో ట్రంప్ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాని తెలుస్తోంది. కోకాపేట్ లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ట్రంప్ టవర్స్ ను నిర్మించనున్నారు. మొత్తం నాలుగు వందల వరకూ లగ్జరీ ఫ్లాట్లను నిర్మించనున్నారు. . అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ ట్రంప్ టవర్స్ హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైనవిగా ఉంటాయని చెబుతున్నారు.
మరోవైపు..రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం హైదరాబాద్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే డ్‌గావ్‌లో మోడల్ ఎకనామిక్ టౌన్‌షిప్ తో రియాల్టీలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోనూ ప్రత్యేకించి పశ్చిమ హైదరాబాద్‌లో వివాదాలు లేని భూమి కోసం అన్వేషిస్తున్నారు. భూమి కలిగిన స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కొలిక్కి వస్తే ట్రంప్, అంబానీ టవర్లు సైతం హైదరాబాద్ రియాల్టీని మరింత ఎత్తుకు చేరుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం స్తబ్దుగా కొనసాగుతున్న హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో ఈ రెండు భారీ ప్రాజెక్టులు జోష్‌ని నింపుతున్నాయి.. హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ వ్యాపారం మందగించిందని తరచూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు. ఇందుకు ట్రంప్, అంబానీల ప్రాజెక్టులు హైదరాబాద్ నగరంలో చేపట్టడాన్ని ఉదాహరిస్తున్నారు
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ రియాల్టీ సంస్థలు ఏవైనా తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లను పశ్చిమ హైదరాబాద్‌లోనే చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. నేరుగా కాకుండా ఇక్కడి సంస్థలతో సంయుక్త భాగస్వామ్యంతో ప్రాజెక్ట్‌లు చేపడుతున్నాయి. భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టిన అనుభవం, మార్కెటింగ్ సిబ్బంది దృష్ట్యా ఆయా కంపెనీలతో చేతులు కలిపితే తమకు కూడా పేరొస్తుందని స్థానిక సంస్థలు వీరితో చేతులు కలుపుతున్నాయి. ఇప్పటికే పదుల సంస్థలు వంద దాకా ఆకాశ హర్మ్యాల భవనాలను నిర్మిస్తున్నాయి. కొన్ని నిర్మాణ దశలో ఉంటే.. మరికొన్ని ఇటీవలే ప్రారంభమయ్యాయి. వీటిలో ఇన్వెంటరీ చాలానే ఉందని రియల్‌ఎస్టేట్ కన్సల్టెన్సీలు తమ నివేదికల్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులతో మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి. వీటిని స్వీకరించే సామర్థ్యం నగరానికి ఉందా వంటి సందేహాలను కొందరు బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం ప్రాజెక్ట్‌లు కాబట్టి ఢోకా ఉండదని డెవలపర్లు అంటున్నారు.
గత కొంత కాలంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో నిస్తేజం కనిపిస్తోంది. భూములు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కొనుగోళ్లు, అమ్మకాలు 38 నుంచి 43 శాతం పడిపోయాయి. పలు రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా, ఆయా ఇళ్ల విక్రయాలు మాత్రం సాగటం లేదు ఓవర్ సప్లై, హై రేట్లే ఇందుకు కారణం. హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీ సేల్స్ 43 శాతానికి పడిపోయాయని డేటా ఎనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ వివరించింది.2025 తొలి త్రైమాసికంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర గల అమ్ముడు పోని ఆస్తుల జాబితా 6% పెరిగి 30,320 యూనిట్లకు చేరుకుంది. రూ.2 కోట్ల కంటే అమ్ముడి పోని ఆస్తులు దేశంలోని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. డిమాండ్-సప్లై మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అమ్మకాలు పడిపోయాయని రియల్ ఎస్టేట్ నిపుణలు చెబుతున్నాయి. ఈ దశలో ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల హైదరాబాద్ రాక ఆసక్తిని కలిగిస్తోంది
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ రాకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కారు విధిస్తున్న ఆంక్షల ప్రభావం భారతీయులపై కూడా పడుతోంది. ఎంతో మంది ఎన్నారైలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెట్టారు. ఇక్కడ వ్యాపారం రంగ మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించడానికి అమెరికా ఎన్నారైలు కూడా ఒక కారణం అనే చెప్పాలి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది ఎన్నారైలు స్వదేశానికి తిరిగి వస్తున్నారు, ఈ కారణంగా ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే స్వయంగా అమెరికా అధ్యక్షుడికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థే హైదరాబాద్‌లో భారీ వెంచర్ ప్రారంభించడం ఆసక్తి కలిగిస్తోంది. ట్రంప్ టవర్స్ కారణంగా ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం మరింతగా విస్తరించే అవకాశం కనిపిస్తోంది.