Stock Market: వెనిజులా సంక్షోభ ప్రభావం.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Stock Market Dips Amid Venezuela Crisis: Sensex, Nifty Trade in Losses
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గత ఏడాది తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న మార్కెట్, ఈ ఏడాదైనా కుదుటపడుతుందని ఇన్వెస్టర్లు ఆశించిన వేళ.. వెనిజులా సంక్షోభం రూపంలో మరో సరికొత్త సమస్య ఎదురైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతోంది.
బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో కూడా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్లు తగ్గి 84,914 స్థాయిలో కొనసాగుతుండగా, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 26,422 వద్ద ట్రేడ్ అవుతోంది.
నిఫ్టీలో మిశ్రమ ప్రదర్శన
నిఫ్టీ సూచీలో టైటాన్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మాక్స్ హెల్త్‌కేర్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు పెద్దగా మార్పుల్లేకుండా ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌పై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.