ఇకపై పెద్ద నోట్లు నో ప్రింటింగ్.. త్వరలోనే కనుమరుగుకానున్న..

Currency Notes: దేశంలో పెద్ద నోట్ల చెలామణి క్రమంగా తగ్గిపోతోందా..? అంటే పెద్ద నోట్ల వాడకం బొత్తిగా తగ్గినట్టేనా..?

Update: 2021-12-08 16:30 GMT

ఇకపై పెద్ద నోట్లు నో ప్రింటింగ్.. త్వరలోనే కనుమరుగుకానున్న..

Currency Notes: దేశంలో పెద్ద నోట్ల చెలామణి క్రమంగా తగ్గిపోతోందా..? అంటే పెద్ద నోట్ల వాడకం బొత్తిగా తగ్గినట్టేనా..? బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి 2000 రూపాయల నోట్లను క్రమంగా ఉపసంహరించుకోడానికి కేంద్రం, ఆర్‌బీఐలు తగిన చర్యలు తీసుకుంటున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని రాజ్యసభలో కూడా కేంద్రం వెల్లడించింది. అంటే పెద్ద నోట్లలో రెండు వేల నోటు ఇక కనడపడే అవకాశాల్లేవు.

సరిగ్గా ఐదేళ్ల క్రితం బ్లాక్ మనీ ఆట కట్టించేదుకు ఉగ్రవాదులకు నిధుల అందకుండా చూసేందుకు 2016 నవంబర్ 8 అర్ధరాత్రి కేంద్రం పెద్ద నోట్లు 1000, 500 రూపాయలను రద్దు చేసేసింది. వాటి స్థానంలో కొత్తగా 2000, 500 రూపాయల నోట్లు తీసుకొచ్చింది. కానీ పెద్దనోట్ల స్థానంలో తీసుకువచ్చిన 2000 విలువ గల నోట్ల చలామణి తగ్గుముఖం పట్టింది. ఈ సంగతి స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు.

2021 నవంబర్‌లో చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 2,000 నోట్లు 1.75 శాతమని రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. 2018 మార్చిలో ఈ నోట్లు 3.27 శాతమని, ఈ కాలంలో నోట్ల సంఖ్య 336.3 కోట్ల నుంచి 223.3 కోట్లకు తగ్గిపోయిందని వెల్లడించారు. విలువ విషయంలో ఇదే కాలంలో పెద్ద నోట్ల వాటా 37.26 శాతం నుంచి 15.11 శాతానికి తగ్గిపోయినట్లు వివరించారు.

ప్రజల ద్రవ్య లావాదేవీల డిమాండ్‌కు అనుగుణంగా కరెన్సీ నోట్లను చలామణీలో ఉంచేందుకు ఎంత విలువ గల నోట్లను ముద్రించాలన్న దానిపై రిజర్వ్‌ బ్యాంక్‌తో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2018-19 తర్వాత నుంచి 2వేల నోట్ల ముద్రణ కోసం కొత్త ప్రతిపాదనేదీ రాలేదు. అందువల్లే పెద్ద నోట్ల చలామణీ తగ్గింది.

2018–19 నుంచి పెద్ద నోట్ల కోసం కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ఎలాంటి తాజా ఇండెంట్‌ పెట్టలేదు. దీనికి తోడు మురికిగా, ముక్కలుగా మారుతున్నందున వ్యవస్థలో మిగిలిన పెద్ద నోట్లు కూడా చెలామణిలో లేకుండా పోనున్నాయి. కరోనా మహమ్మారి, అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీని దగ్గర ఉంచుకోడంపై ప్రజలు ఉత్సుకత ప్రదర్శించారు. దీనితో కరెన్సీకి డిమాండ్‌ నెలకొంది. ఈ సమయంలో ప్రజలు దాదాపు 3.3 లక్షల కోట్లు తమ వద్ద ఉంచుకున్నట్లు అంచనా. ఇది కూడా కరెన్సీ నోట్ల చలామణీ తగ్గడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. మొత్తానికి పెద్ద నోట్లు త్వరలోనే కనుమరుగుకానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News