Meesho: మీషోకు ఐటీ శాఖ షాక్.. రూ.1,500 కోట్ల భారీ పన్ను నోటీసు.. అసలేం జరిగిందంటే?

Meesho: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషోకు ఆదాయపు పన్ను శాఖ రూ.1,500 కోట్ల భారీ పన్ను నోటీసు జారీ చేసింది. ఆదాయ గణాంకాల్లో వ్యత్యాసాలు, డిస్కౌంట్లపై పన్ను వివాదం, కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-08 12:08 GMT

Meesho: మీషోకు ఐటీ శాఖ షాక్.. రూ.1,500 కోట్ల భారీ పన్ను నోటీసు.. అసలేం జరిగిందంటే?

Meesho: తక్కువ ధరలకే ఉత్పత్తులను అందిస్తూ సామాన్యులకు చేరువైన ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో (Meesho) ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఆ కంపెనీకి ఏకంగా రూ.1,500 కోట్ల భారీ పన్ను నోటీసు అందింది. ఈ పరిణామం అటు కంపెనీకి, ఇటు ఆ యాప్‌లో డిస్కౌంట్ల కోసం వెతికే కస్టమర్లకు షాకింగ్‌గా మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ తన వాస్తవ ఆదాయాన్ని తక్కువగా చూపిందని ఆరోపిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నోటీసులో ఏముందంటే..

ఆదాయపు పన్ను శాఖ జరిపిన విశ్లేషణలో మీషో ప్రకటించిన ఆదాయ గణాంకాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. దీనిపై స్పందించిన అధికారులు బకాయి ఉన్న పన్నుతో పాటు, భారీ మొత్తంలో వడ్డీని కూడా కలిపి రూ.1,500 కోట్ల డిమాండ్ నోటీసును మీషోకు పంపారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో మీషో స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే, ఈ నోటీసు తమ వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని కంపెనీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది.

డిస్కౌంట్లే కంపెనీకి శాపమా

సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే, ఈ తగ్గింపులే ఇప్పుడు పన్ను సమస్యలకు దారితీస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లను తమ బ్యాలెన్స్ షీట్లలో "వ్యాపార ఖర్చులు"గా చూపిస్తాయి. దీనివల్ల పన్ను కట్టాల్సిన లాభం తగ్గుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ డిస్కౌంట్లను పూర్తిగా "వ్యాపార ఖర్చులు"గా అంగీకరించదు. దీంతో కంపెనీలకు పన్ను బకాయిలు పెరుగుతాయి. ఇలాంటి నోటీసులు మీషోకు కొత్త కాదు. గతంలో కూడా కంపెనీ ఇలాంటి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. జనవరి 2025లో ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌లలో మార్పుల కోరుతూ మీషోకు షో-కాజ్ నోటీసు ఇచ్చింది. అదే ఏడాది మార్చి 13న రూ.572 కోట్ల పన్ను డిమాండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ నోటీసుపై కంపెనీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసింది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే..

ఒకవైపు పన్నుల పోటు, మరోవైపు పెరిగిన నష్టాలు మీషోను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం 13 రెట్లు పెరిగి రూ.491 కోట్లకు చేరింది. నష్టాలు పెరిగినప్పటికీ, నిర్వహణ ఆదాయం 31% పెరిగి రూ.3,517 కోట్లకు చేరుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాల మధ్య శుక్రవారం బిఎస్ఈ (BSE)లో మీషో షేర్ ధర రూ.159.10 వద్ద ముగిసింది. ఇదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ అభ్యంతరాలతో తాము విభేదిస్తున్నామని, చట్టపరంగా పోరాడతామని మీషో స్పష్టం చేసింది. అయితే, ఈ భారీ పన్ను డిమాండ్ కంపెనీ భవిష్యత్తు వ్యూహాలను, కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News