Mukesh Ambani: ఆస్ట్రేలియా కంపెనీ అంబానీ గుప్పిట్లోకి!
Mukesh Ambani: పెట్రోలియం నుంచి రిటైల్ వరకు.. టెలికాం నుంచి సాఫ్ట్ డ్రింక్స్ వరకు.. ముఖేష్ అంబానీ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలే.
Mukesh Ambani: పెట్రోలియం నుంచి రిటైల్ వరకు.. టెలికాం నుంచి సాఫ్ట్ డ్రింక్స్ వరకు.. ముఖేష్ అంబానీ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలే. క్యాంపా కోలాతో దేశీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్, ఇప్పుడు తన రూటు మార్చింది. కేవలం దేశీ మార్కెట్లోనే కాదు, అంతర్జాతీయంగానూ జెండా పాతేందుకు ఆస్ట్రేలియా గడ్డపై భారీ డీల్ కుదుర్చుకుంది.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బెవరేజ్ దిగ్గజం గుడ్‌నెస్ గ్రూప్ గ్లోబల్‌లో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంది. ఈ ఒక్క ఒప్పందంతో రిలయన్స్ అధికారికంగా ఆస్ట్రేలియా వినియోగదారుల మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచస్థాయి బ్రాండ్లను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అంబానీ వేస్తున్న అడుగులకు ఇది నిదర్శనం.
ఈ కొనుగోలుతో గుడ్‌నెస్ గ్రూప్‌నకు చెందిన పాపులర్ హెల్త్ డ్రింక్ బ్రాండ్లు నెక్స్‌బా , పేస్ ఇప్పుడు రిలయన్స్ చేతికి వచ్చాయి.పేస్ బ్రాండ్ ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి రూపొందించిన హైడ్రేషన్ డ్రింక్.నేటి తరం కోరుకునే విధంగా తక్కువ చక్కెర, ప్లాంట్ బేస్డ్ స్వీటెనర్లతో తయారయ్యే 'గట్-హెల్త్' పానీయాలపై రిలయన్స్ దృష్టి సారించింది. ఈ బ్రాండ్లను త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా తీసుకురావాలని రిలయన్స్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
సిడ్నీ కేంద్రంగా పనిచేసే గుడ్‌నెస్ గ్రూప్ ఇప్పటికే 20 అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని చాటుకుంది. రిలయన్స్ అండ లభించడంతో ఈ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరించనున్నాయి. ఇప్పటికే యూఏఈ, ఖతార్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఎఫ్ఎంసీజీ కార్యకలాపాలను ప్రారంభించిన అంబానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా డీల్‌తో పసిఫిక్ రీజియన్‌లోనూ పట్టు సాధించారు.
అంతర్జాతీయ బ్రాండ్లను ఇండియాకు తీసుకురావడమే కాదు.. విదేశీ గడ్డపై నేరుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం ముఖేష్ అంబానీ కొత్త వ్యూహం. హెల్తీ డ్రింక్స్ విభాగంలో గ్లోబల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ సర్వసన్నద్ధమైందని ఈ పరిణామం రుజువు చేస్తోంది.