Stock Market Holiday : బ్యాంకు పనులు ఉంటే వాయిదా వేసుకోండి.. నేడు స్టాక్ మార్కెట్లకు కూడా సెలవు..ఎందుకంటే ?
Stock Market Holiday : నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు మూతపడ్డాయి. ఏప్రిల్ నెలలో మరిన్ని సెలవులు రానున్నాయి.
Stock Market Holiday
Stock Market Holiday : నేడు ఏప్రిల్ 3, గుడ్ ఫ్రైడే కావడంతో భారతీయ స్టాక్ మార్కెట్లయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లలో ఎటువంటి ట్రేడింగ్ జరగదు. ఈ వారం ఇన్వెస్టర్లకు ఇది రెండో సెలవు. అంతకుముందు మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. ఇలా ఒకే వారంలో రెండు సెలవులు రావడం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ (నగదు లభ్యత), ట్రేడింగ్ వాల్యూమ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మళ్ళీ సోమవారం నుంచే రెగ్యులర్ ట్రేడింగ్ ప్రారంభం కానుంది.
ఎంసీఎక్స్ కూడా బంద్
కేవలం ఈక్విటీ మార్కెట్లే కాకుండా, కమోడిటీ మార్కెట్ కూడా నేడు మూతపడింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం, సాయంత్రం సెషన్లు రెండూ గుడ్ ఫ్రైడే సందర్భంగా రద్దయ్యాయి. మార్చి 31న కేవలం ఉదయం పూట మాత్రమే సెలవు ఇచ్చి సాయంత్రం ట్రేడింగ్‌కు అనుమతించారు, కానీ నేడు మాత్రం రోజంతా కార్యకలాపాలు నిలిపివేశారు. దీనివల్ల బంగారం, వెండి వంటి కమోడిటీలపై ట్రేడ్ చేసే వారికి నేడు విరామం దొరికినట్లయింది.
బ్యాంకులకు కూడా తాళాలే
గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశంలోని మెజారిటీ నగరాల్లో బ్యాంకులు నేడు పనిచేయవు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. అయితే అగర్తల, గువహటి, జైపూర్, జమ్ము మరియు శ్రీనగర్ వంటి కొన్ని నగరాల్లో మాత్రం బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నిన్న అంటే ఏప్రిల్ 2న కొచ్చి, తిరువనంతపురంలో మౌండీ థర్స్డే సందర్భంగా ఇప్పటికే బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
ఏప్రిల్‌లో మరిన్ని సెలవులు ఇవే
ఈ నెలలో సెలవుల సందడి ఇక్కడితో ఆగిపోలేదు. ఏప్రిల్ 14, మంగళవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాత గౌరవార్థం దేశవ్యాప్తంగా ఆ రోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తారు. ఆ తర్వాత మే 1న మహారాష్ట్ర దినోత్సవం, మే 28న బక్రీద్ సందర్భంగా కూడా మార్కెట్లు పనిచేయవు. ఇక జూన్ 26న మొహర్రం కారణంగా కూడా ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం
వరుస సెలవుల వల్ల మార్కెట్‌లో వొలటాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులను బట్టి సోమవారం మార్కెట్ ఎలా స్పందిస్తుందోనని ట్రేడర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకు పనులు ఉన్నవారు ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వాడుకోవచ్చు, కానీ భౌతిక లావాదేవీల కోసం సోమవారం వరకు వేచి చూడక తప్పదు.




