Post Office Scheme: అద్బుతమైన స్కీమ్.. కేవలం 5ఏళ్లలో వడ్డీతోనే రూ. 4.50లక్షలు మీ సొంతం..!!
Post Office Scheme: అద్బుతమైన స్కీమ్.. కేవలం 5ఏళ్లలో వడ్డీతోనే రూ. 4.50లక్షలు మీ సొంతం..!!
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం రిస్క్ లేని పెట్టుబడి ఎంపిక అని చెప్పవచ్చు. రూ. 1,000 నుంచి ఈ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. 5 సంవత్సరాల లాక్-ఇన్‌తో 7.7శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 10 లక్షల పెట్టుబడికి సుమారు రూ. 4.5 లక్షల వడ్డీ వస్తుంది. అంతేకాదు ఈ స్కీములో పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
పెట్టుబడుల విషయంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వారికి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. సరైన నియమాలు పాటిస్తూ పెట్టుబడి పెట్టినట్లయితే.. ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన, నమ్మదగిన రాబడిని పొందవచ్చు. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉండాలనుకునే వారు.. తమ పొదుపును సురక్షితంగా పెంచుకోవాలనుకునే వారికి ఈ పథకాలు మంచి పరిష్కారంగా నిలుస్తాయి. అలాంటి పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒక ముఖ్యమైన స్కీమ్.
NSC పథకం ద్వారా పెట్టుబడిదారులు కేవలం వడ్డీ రూపంలోనే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీసంగా రూ. 1,000 మాత్రమే అవసరం అవుతుంది. చిన్న మొత్తంతో ప్రారంభించి.. అవసరాన్ని బట్టి పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంది. ఈ పథకం మొత్తం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ కాలాన్ని కలిగి ఉంటుంది. అంటే.. పెట్టుబడి చేసిన మొత్తాన్ని ఐదు సంవత్సరాల పూర్తయ్యే వరకు విత్ డ్రా చేసుకోలేరు. అయితే.. ఈ కాలం పూర్తయ్యాక ఒకేసారి ప్రధాన మొత్తం, వడ్డీ మొత్తాన్ని పొందవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది భారత పోస్టాఫీస్ నిర్వహించే చిన్న పొదుపు పథకాలలో ఒకటి. మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, అలాగే పదవీ విరమణ కోసం ముందుగానే ప్రణాళిక వేసుకునే వారు ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే మీరు ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే.. ఈ పథకం భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. NRIలు, కంపెనీలు, ట్రస్టులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF) ఈ పథకానికి అర్హులు కావు.
ఈ పథకంలో సింగిల్ అకౌంట్ తో పాటు జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు. పెద్దలు తమ పేరుతోనే కాకుండా మైనర్ పిల్లల పేరుతో కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, NSCలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ప్రస్తుతం NSC పథకం వార్షికంగా 7.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఈ పథకంలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే, ఐదు సంవత్సరాల కాలంలో కేవలం వడ్డీ రూపంలో సుమారు రూ. 4,49,034 సంపాదించవచ్చు. ఐదు సంవత్సరాల పూర్తయ్యాక పెట్టుబడిదారుడు పొందే మొత్తం సుమారు రూ. 14,49,034 అవుతుంది. సంవత్సరాల వారీగా చూస్తే, మొదటి సంవత్సరంలో సుమారు రూ. 77,000 వడ్డీ వస్తుంది. రెండో సంవత్సరం చివరికి మొత్తం వడ్డీ రూ. 1,59,929కు చేరుతుంది. మూడో సంవత్సరం ముగిసే సరికి ఇది రూ. 2,49,044గా, నాల్గవ సంవత్సరం చివరికి రూ. 3,45,620గా మారుతుంది. ఐదవ సంవత్సరం పూర్తయ్యే సమయానికి మొత్తం వడ్డీ రూ. 4,49,034కు చేరుకుంటుంది. ఈ విధంగా, ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడిని అందించే పథకంగా NSC నిలుస్తుంది.