PhonePe : ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్.. అది ఏంటో చూశారా!
డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పే 'నేచురల్ లాంగ్వేజ్ సెర్చ్' అనే ఫీచర్‌ను తాజాగా తీసుకొచ్చింది.
PhonePe : ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్.. అది ఏంటో చూశారా!
డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పే 'నేచురల్ లాంగ్వేజ్ సెర్చ్' అనే ఫీచర్‌ను తాజాగా తీసుకొచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల మనకు కలిగే లాభాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎవరికైనా డబ్బులు పంపాలన్నా లేదా రీఛార్జ్ చేసుకోవాలన్నా ఫోన్‌పే యాప్‌లో వెతుక్కుంటాం. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం నేరుగా ఆర్డర్లు ఇవ్వొచ్చు. అది ఎలాగో తెలుసా..
ఉదాహరణకు.. హేమంత్ అనే వ్యక్తికి రూ.20 పంపించు అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, వెంటనే పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చెయ్ అని చెబితే చాలు, ఆ ఇంటర్‌ఫేస్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొత్తానికి, ఈ కొత్త ఫీచర్‌తో యాప్‌లో ఎక్కడో లోపల ఉండే ఆప్షన్లను వెతుక్కునే శ్రమ తప్పుతుంది. న్యూఢిల్లీలో జరిగిన 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా ఫోన్‌పే ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ సహాయంతో దీనిని తయారు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు కూడా పాల్గొని, భవిష్యత్తులో AI రంగంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. మనం ఇచ్చే వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్లను అర్థం చేసుకోవడానికి ఫోన్‌పే హైబ్రిడ్ మోడల్‌ను వాడుతోంది. అంటే సమాచారం కొంత డివైజ్‌లో, మరికొంత క్లౌడ్‌లో ప్రాసెస్ అవుతుంది. దీంతో మన వ్యక్తిగత వివరాలు, లావాదేవీల డేటాకు ఏదైనా హాని జరుగుతుందనే అనుమానం రాక మానదు.. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. మన డేటా, వ్యక్తిగత వివరాలు చాలా సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా సంస్థ సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ.. "కేవలం ఇన్‌పుట్ ఇవ్వడమే కాకుండా, యూజర్ అసలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకునేలా ఫోన్‌పేను తీర్చిదిద్దుతున్నాం" అని తెలిపారు. త్వరలోనే ఇది అందరి ఫోన్లలో దర్శనమివ్వనుందని వెల్లడించారు.